వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ పాత భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వరంగల్ పట్టణంలోని మండి బజార్‌లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండి బజారులో నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి దుగ్గొండి మండలం రేబల్లె గ్రామానికి చెందిన తిప్పారాపు పైడి(60) వాచ్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడితో పాటు సలీమా అనే మహిళ కూడా అక్కడే పని చేస్తోంది. భవనం పరిసర ప్రాంతంలోని గుడిసెలో వారు నివాసం ఉంటున్నారు. శుక్రవారం సాయంత్రం సలీమా కుమారుడు ఫిరోజ్(22) ఆమెను చూసేందుకు వచ్చాడు. భారీ వర్షం కురుస్తుండడంతో శనివారం తెల్లవారుజామున వారి గుడిసెకు సమీపంలో ఉన్న పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.ఆ భవానికి సంబంధించిన గోడలు సలీమా నివస్తున్న గుడిసై పడ్డాయి.
ఈ ఘటనలో పైడి, ఫిరోజ్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. సలీమా తీవ్రంగా గాయపడడంతో ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఫిరోజు తొర్రూరు మండలం మాటేడు గ్రామంలో నివసిస్తున్నాడు. ఫిరోజ్‌కు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. రేపు(ఆదివారం) నిశ్చితార్థం జరగాల్సి ఉండగా.. అందుకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసేందుకు నగరానికి వచ్చాడు. ప్రమాదంలో అతడు మృతి చెందడం స్థానికులను కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.