మేడారం సమ్మక్క, సారమ్మల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. జనగామ జిల్లాలో కూడా సమ్మక్క, సారలమ్మల జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. జాతర నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు శుక్రవారం నాడు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శివలింగయ్య తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గవర్నమెంట్ ఆఫీస్‌లు యథావిధిగా నడుస్తాయని తెలిపింది. కేవలం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు మాత్రమే సెలవు ప్రకటించారు. అయితే ఇవాళ ప్రకటించిన సెలవుకు బదులుగా మార్చి 12న రెండో శనివారం నాడు విద్యా సంస్థలకు సెలవు ఉండదని తెలిపారు.
అలాగే మేడారం సమ్మక్క, సారలమ్మల జాతరను పురస్కరించుకొని శుక్రవారం నాడు వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్సిటీతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ డిగ్రీ, పీజీ కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య బి..వెంకట్రాంరెడ్డి తెలిపారు. అదేవిధంగా ఇవాళ ప్రకటించిన సెలవుకు బదులుగా మార్చి 12వ తేదీన పని దినంగా పాటించాలని చెప్పారు. ఈ విషయాన్ని విద్యార్థులు, అధికారులు గమనించాలన్నారు.