ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, వరంగల్ కోఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు పార్టీకి రాజీనామా చేసినట్లు ఆదివారం ప్రకటించారు. 2018 ఎన్నికల్లో ప్రదీప్ రావు వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యే టికెట్, ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఆశించి భంగపడ్డారు. అప్పటి నుంచి పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన.. నేడు టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసినట్లు తెలిపారు. వరంగల్‌లోని తన నివాసంలో ప్రదీప్‌రావు మాట్లాడారు.
టీఆర్‌ఎస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఎన్నో అవమానాలు పడ్డానని, అన్నీ సహించి ఇన్నాళ్లూ పార్టీలో కొనసాగనన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని, తమ కార్యకర్తలకు టీఆర్‌ఎస్ ఏం చేయలేదన్నారు. బంగారు తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేశానన్నారు. స్థానిక ఎమ్మెల్యే అవమానపరిచేలా మాట్లాడారని, పార్టీలో ఉండగానే ఎమ్మెల్యే తమను తిట్టాడని ఆరోపించారు. ఆయన తిట్టినా పార్టీ నేతలు ఎవరూ దాన్ని ఖండించలేదని వివరించారు.
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తన సహకారం లేకుండా విజయం సాధించినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని, ఆయనకు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని ప్రదీవప్ రావు సవాల్ చేశారు. అలాగే.. తనను ఏ పార్టీ ఇదరిస్తే.. ఆ పార్టీకి వెళ్తానని, లేదంటే ఇండిపెండెంట్‌గా ఉంటానని ప్రదీప్‌రావు చెప్పారు. ఇక ఆయన బీజేపీ గూటికి చేరనున్నారని, కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది.