మత్తు ఇంజెక్షన్ ఇస్తుండగా గుండెపోటు రావడంతో 8 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో మంగళవారం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా లింగయ్య తండాకు చెందిన భూక్య శివ, లలిత దంపతుల చిన్న కుమారుడు నిహాన్‌కు సెప్టెంబర్ 4న జరిగిన ప్రమాదంలో కుడి చేయి విరిగింది. అదే రోజు అతడిని ఎంజీఎంలో చేర్పించారు. మంగళవారం శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఉదయం 10.30 గంటలకు బాలుడిని శస్త్రచికిత్స గదికి తీసుకెళ్లారు.
అక్కడ అనస్థీషియా (మత్తు మందు) ఇస్తుండగా, బాలుడికి గుండెపోటు వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. అతన్ని ఆర్‌ఐసియు వార్డుకు తరలించి కృత్రిమ శ్వాస ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది. మధ్యాహ్నం 1.10 గంటలకు బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సుమారు మూడు గంటలైనా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులపై కూడా దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
బాలుడి మృతికి గల కారణాలపై విచారణకు సీనియర్ వైద్యులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి ఎంజీఎం అధికారులను ఆదేశించారు.