కలుషిత నీరు తాగి 24 మంది వ్యవసాయ కూలీలు అస్వస్థతకు గురైన సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడు గొల్లగూడేం గ్రామంలో చోటు చేసుకుంది.
ఉప్పేడు గొల్లగూడేం గ్రామంలో ఓ రైతు మిర్చి తోటలో పని కోసం కూలీలు వెళ్లారు. భోజనం చేసే సమయంలో మరో రైతు పొలంలో ఉన్న పైపుల వద్ద నీటిని తెచ్చుకుని తాగారు. అయితే.. కొద్ది సేపటికే నీరు తాగిన వారు వాంతులు చేసుకున్నారు. కొందరు కళ్లు తిరిగి కిందపడిపోయారు.
వెంటన వారిని ట్రాక్టర్‌పై వెంకటాపురం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు కూలీల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఇలా ఎందుకు జరిగిందని మిగిలిన కూలీలు ఆరా తీయగా.. సదరు రైతు తన పొలంలోని డ్రిప్ పైపులను శభ్రం చేసేందుకు పాస్ఫరిక్ యాసిడ్ అనే మందును ఉపయోగించాడని, ఆ పైపుల నుంచే నీరు విడిచిపెట్టినట్లు తెలిసింది. విషయం తెలియక కూలీలు ఆ నీటిని పట్టుకుని తాగడంతో అస్వస్థతకు గురైయ్యారు.