వరంగల్‌కు మెట్రో రైలు.. ఒప్పందం కుదుర్చుకున్న సర్కార్..!
By సుభాష్ Published on 28 Dec 2019 2:16 PM ISTవరంగల్ ప్రజలకు తెలంగాణ సర్కార్ శుభవార్త వినిపించింది. హైదరాబాద్‌లో నిర్మించిన మెట్రో రైలు తరహాలో వరంగల్‌లో నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రకు చెందిన మహా మెట్రో సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవల హైదరాబాద్‌లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులతో సమావేశం కాగా, ఈ సమావేశంలో వరంగల్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందుకు సంతృప్తి చెందిన మంత్రి కేటీఆర్ మహారాష్ట్ర మెట్రో ఎండీ డాక్టర్ బ్రజేష్ దీక్షత్ బృందాన్ని పూర్తి వివరాలు రూపొందించాలని కోరినట్లు తెలుస్తోంది.
రూ. 2700 కోట్ల వ్యయంతో..
వరంగల్ నగరం చుట్టూ నిర్మించి నియో మెట్రో రైలు ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2700 కోట్లు అవుతోందని, నిజానికి ఇతర నిర్మాణ సంస్థలు కిలో మీటర్ రూ. 250 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టాయి. కాగా, ఈ మెట్రోసంస్థ మాత్రం కేవలం రూ. 180 కోట్లకే కిలోమీటర్ మెట్రోమార్గాన్ని నిర్మించిన ఘటన కూడా ఉంది. ఇక అదే తరహాలో నియో మెట్రో మార్గాన్ని మాత్రం కేవలం రూ. 72 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం.
తక్కువ ఖర్చుతో మెట్రో నిర్మాణం
దాదాపు 10 లక్షల జనాభా ఉన్న వరంగల్‌లో మెట్రో నియో ప్రాజెక్టు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు అధ్యయనం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే దాదాపు రూ.1,100 నుంచి రూ.1,200 కోట్లతో ఈ మెట్రో మార్గాన్ని అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలోని దాదాపు వంద దేశాల్లో అతి తక్కువ ఖర్చుతో నిర్మించిన మెట్రో నియో, మన దేశంలో మహారాష్ట్ర తర్వాత తెలంగాణలో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలున్నాయి.