రోజు ఐదు నిమిషాలు వాకింగ్ చేస్తే..
By సుభాష్ Published on 20 Feb 2020 9:29 AM GMTప్రస్తుత కాలంలో అనారోగ్యం బారిన పడేవాళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కుటుంబ బాధ్యతలు, టెన్షన్, పనిలో ఒత్తిడి ఇలా రకరకాలుగా ప్రతి రోజు ఎంతో ఒత్తిళ్లకు గురవుతూ అనారోగ్యం పాలువుతున్నాము. ఈ బీజీ లైఫ్‌లో కనీసం వాకింగ్ కూడా చేయడానికి వీలుపడని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు తినే తిండిలో కూడా కల్తీ జరుగుతోంది. దీని వల్ల అనారోగ్యాలు దరి చేరుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కనీసం ఐదు నిమిషాల పాటు వాకింగ్ చేసినట్లయితే ఎన్నో ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా అనారోగ్యాన్ని దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు. వాకింగ్ చేయడం వల్ల శరీరంలో అవయవాలు అటూ ఇటు కదిలి కొవ్వు కరిగిపోయి ఆరోగ్యం పెరుగుతుంది.
వాకింగ్ చేస్తే ఎలాంటి ప్రయోజనాలు
ప్రతి రోజు వాకింగ్ కానీ, రన్నింగ్ చేయడం వల్ల శరీరం మొత్తం అటూ ఇటు కదులుతుంది. కేలరీలు వేగంగా ఖర్చు అవుతాయి. కనీసం ఐదు నిమిషాల పాటు రన్నింగ్ చేస్తే బాడీలో కొవ్వు కరిగిపోతోందని చెబుతున్నారు వైద్య నిపుణులు. మనకు రోజు ఎన్ని కేలరీల శక్తి వస్తుందో.. అంతకంటే ఎక్కువ శక్తి ఖర్చయితేనే బరువు తగ్గే అవకాశాలుంటాయి.
ఉదయం లేవగానే జాగింగ్‌కు వెళితే ఆ పచ్చటి ప్రకృతి, సూర్యకిరణాలు, పక్షుల అరుపులు, మంచి వాతావరణం ఇలా అన్ని మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. దీంతో తలనొప్పి కూడా తగ్గుతుంది. శరీరానికి, బ్రెయిన్‌కు అధికంగా ఆక్సిజన్ అందుతుంది. డిప్రెషన్ తగ్గుతుంది. రోజు వారిగా జాగింగ్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా ఆరోగ్యం ఎంతో మెరుగు పడుతుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది.
మధుమోహం ఉన్న వారికి.
ఈ రోజుల్లో మధుమోహ వ్యాధి చాలా మందిని వేధిస్తోంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల మధుమోహం ఉన్నవారికి ఎంతో మంచిది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. రోజు ఐదు నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల మధుమోహాన్ని అదుపులో పెట్టుకోవచ్చని, శరీరం కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుందని చెబుతున్నారు. రోజు ఐదు నిమిషాల పాటు జాగింగ్ చేస్తే షుగర్ సమస్యలకు చెక్ పట్టవచ్చని పరిశోధనలు రుజువు చేశాయి.
చాలా మంది రాత్రి సమయాల్లో నిద్రపట్టక ఇబ్బందులు పడుతుంటారు. రాత్రుల్లో మొబైళ్లు వాడటం, చాటింగ్ చేయడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. ఇలా నిద్రలేమికి కూడా వాకింగ్‌తో చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. శరీరంలో కొవ్వు కరిగి శరీరంలో అన్ని అవయవాలు చక్కగా పని చేస్తాయి. బ్రెయిన్ చురుకుగా మారి చక్కటి నిద్ర వస్తుంది. దీంతో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటుంది.
హైబీపీ సమస్య ఉన్నవారికి..
రోజువారిగా వాకింగ్ చేసిన వారికి బీపీ కంట్రోల్లో ఉంటుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోయి రక్త సరఫరా సరిగ్గా జరుగుతుంది. ఇలా ప్రతి రోజు వాకింగ్ చేసినట్లయితే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని పరిశోధనల్లో తేలింది.