పోలీసు వ్యవస్థలో మార్పు తీసుకొని రాలేకపోయాను.. ఇక రిటైర్మెంట్ తీసుకుంటా: వి.కె.సింగ్

By సుభాష్  Published on  25 Jun 2020 3:58 AM GMT
పోలీసు వ్యవస్థలో మార్పు తీసుకొని రాలేకపోయాను.. ఇక రిటైర్మెంట్ తీసుకుంటా: వి.కె.సింగ్

ఐపీఎస్ అధికారి, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడెమీ డైరెక్టర్ వినోయ్ కుమార్ సింగ్(వి.కె.సింగ్) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కు పంపారు. పోలీసు శాఖలో ఎన్నో సంస్కరణలు తేవాలనే ఆశయం తనకు ఉండేదని కానీ అందులో సఫలం కాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ లెటర్ రాశారు. అందుకే వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నానని తెలిపారు వి.కె.సింగ్. తన సర్వీస్‌ పట్ల ప్రభుత్వం సంతృప్తిగా లేనట్టుందని.. అందుకే ప్రభుత్వానికి తాను భారం కాదల్చుకోలేదని తెలిపారు.

పోలీస్ వ్యవస్థలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఉద్యోగంలో ఉండి ఆ దిశగా పని చేయలేకపోతున్నానని అన్నారు. రిటైర్మెంట్ తర్వాత వ్యవస్థలో మార్పు కోసమే పని చేస్తానని పేర్కొన్నారు. 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సింగ్ సర్వీసు ఇంకా కొద్ది నెలలు ఉన్నప్పటికీ వాలంటరీగా రాజీనామా చేశారు. సత్యం, న్యాయం అనే పదాలకు మారుపేరైన గాంధీజీ జయంతి(అక్టోబర్ 2న) తాను విధుల నుంచి పూర్తిగా వైదొలుగుతానని, రాజీనామా లేఖను మూడు నెలల నోటీస్ పిరియడ్ గానూ భావించాలని కేంద్రాన్ని కోరారు వి.కె.సింగ్.

గత కొంతకాలంగా తనకు రావాల్సిన ప్రమోషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై వీకే సింగ్ అసంతృప్తితో ఉండడమే ఈ రాజీనామాకు కారణమని తెలుస్తోంది. మే 21న కూడా తన ప్రమోషన్‌కు సంబంధించి వినోయ్ కుమార్ సింగ్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు తన లెటర్ హెడ్‌పై లేఖ రాశారు. ఆ లేఖ కాపీని సీఎం కేసీఆర్‌కు కూడా పంపారు. డీజీపీగా తనకు ప్రమోషన్ ఇవ్వాలని, అందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని ఆ లేఖలో వీకే సింగ్ ప్రభుత్వానికి తెలిపారు. ఒకవేళ ప్రమోషన్‌కు కావాల్సిన అర్హతలు తనకు లేవని ప్రభుత్వం భావిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని లేఖలో తెలిపారు. నిబంధనల ప్రకారం 33 ఏళ్లు సేవలందించిన సీనియర్ ఐపీఎస్ అధికారిగా తాను డీజీపీ పదవికి అర్హుడినని వీకే సింగ్ లేఖలో ప్రభుత్వానికి తెలిపారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఆయన రాజీనామా లేఖను అమిత్ షాకు పంపారు.

Next Story