వైజాగ్ ఏజెన్సీలో పండించే పసుపుకు భారీ డిమాండ్.. దానిలో ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 April 2020 7:07 AM GMT
వైజాగ్ ఏజెన్సీలో పండించే పసుపుకు భారీ డిమాండ్.. దానిలో ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే..?

కరోనా మహమ్మారి రోజురోజుకీ పెరిగిపోతూ ఉండడంతో ప్రజలు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని భావిస్తున్నారు. అందుకే ఇటీవలి కాలంలో పసుపు వినియోగం కూడా ఎక్కువైంది. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో లభించే పసుపుకు డిమాండ్ భారీగా పెరిపోతోంది. అందుకు ముఖ్యకారణం పసుపులో రోగ నిరోధక శక్తిని పెంపొందించే లక్షణాలు ఉండడంతో పాటూ పోషకవిలువలు మెండుగా ఉంటాయి.

విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా లభించే ఈ పసుపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. ఇకపై ఎక్కువగా పండించేలా చర్యలు తీసుకునేలా ఆదేశాలను జారీ చేసింది. పసుపులో ఉండే కర్క్యుమిన్(Curcumin) అనే క్రియాశీల పదార్థం కారణంగా పలు అనారోగ్య సమస్యలకు పసుపు చెక్ పెడుతుంది. యాంటీ ఆక్సిండెంట్ గా పని చేస్తుంది. పసుపు ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించే పదార్థాలను తయారు చేయాలని ఇప్పటికే ఫార్మా సెక్టర్ ప్రయత్నాలను మొదలుపెట్టింది.

వైజాగ్ ఏజెన్సీ లోని చింతపల్లిలో ఉన్న హార్టికల్చర్ రీసర్చ్ స్టేషన్ సైంటిస్ట్ డాక్టర్ వి.శివకుమార్ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో 11000 హెక్టార్లలో పసుపును పండిస్తూ ఉన్నారని తెలిపారు. ఇక్కడి పసుపు పంటలో 6.5 శాతం కర్క్యుమిన్ ఉంటుందని.. దీనికి ఫార్మా ఇండస్ట్రీలో హై డిమాండ్ ఉందని అన్నారు. అలాగే ఇమ్యూనిటీని పెంపొందించే అన్ని లక్షణాలు ఇందులో ఉంటాయని ఆయన అన్నారు.

ఆయుర్వేద శాస్త్రంలో కూడా పసుపుకు చాలా వాటిలో వాడుతారు. విరివిగా పసుపు వాడడం వలన చాలా రోగాలను దూరం చేయవచ్చని చెబుతారు. కోవిద్-19 ప్రబలుతున్న సమయంలో పసుపు ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందింపజేయొచ్చు. పసుపును వేడి పాలల్లో కలిపి తీసుకుంటే శ్వాసకు సంబంధించి చాలా మంచి ఫలితాలు ఉంటాయని ఎప్పటి నుండే నమ్ముతున్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో పసుపు పంటను సంవత్సరానికి ఒకసారి వేస్తూ ఉంటారు. మర్చి నుండి మే నెలల్లో అమ్మకానికి పెడుతూ ఉంటారు. ఒక హెక్టారుకు ఎనిమిది టన్నుల పసుపు పండించవచ్చు. బెస్ట్ క్వాలిటీ పసుపు కేజీ 150 రూపాయలు ఉంటుందని శివకుమార్ తెలిపారు.

ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ITDA) పాడేరుకు చెందిన ప్రాజెక్టు ఆఫీసర్ డి.కె.బాలాజీ మాట్లాడుతూ 'ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో పసుపు అమ్మకాలకు అనుమతులను ఇచ్చామని' చెబుతున్నారు. అలాగే రాబోయే రోజుల్లో పసుపు పంటకు సంబంధించి మరిన్ని మార్గదర్శకాలు తీసుకు వస్తామని.. పసుపు దిగుబడి పెంపొందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Next Story