జో బైడెన్ సర్కార్‌లో భారతీయుడికి కీలక బాధ్యతలు..!
By సుభాష్ Published on 8 Nov 2020 10:01 AM GMTఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించి ట్రంప్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. నాలుగేళ్ల ట్రంప్ పాలనలో విసుగు చెందిన అమెకన్స్ బైడెక్‌కు పట్టం కట్టారు. విమర్శలు, వివాదాలతో కాలం గడిపిన అధ్యక్షుడిని కోలుకోలేని దెబ్బ కొట్టారు. ముందు నుంచి విజయంపై అత్యాశపడ్డ ట్రంప్‌కు నిరాశ ఎదురైంది. ఇక ఈ డెమోక్రటిక్ నుంచి బరిలో నిలిచి అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారీస్ చరిత్ర సృష్టించారు. దీంతో ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఒక మహిళ, ఒక ఆసియన్ అమెరికన్‌కు ఈ పదవి దక్కడం ఇదే మొదటిసారి.
ఇక భారతీయులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్దమయ్యారు. మరో వైపు జో బైడెన్ ప్రభుత్వంలో మరో భారతీయుడికి చోటు దక్కే అవకాశం ఉందని అమెరికా వర్గాల ద్వారా సమాచారం. డాక్టర్ వివేక్ మూర్తికి టాస్క్ ఫోర్స్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటకకు చెందిన మూర్తిని 2014లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా 19వ సర్జన్ జనరల్‌గా నియమించారు. అమెరికాలో కోవిడ్ అదుపు చేసేందుకు కొత్త టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని బైడెన్ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి మూర్తినే చీఫ్‌గా నియమిస్తారని సమాచారం. దీనిపై మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.