స్మార్ట్‌ సిటీలో రోబో పోలీస్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Nov 2019 6:03 AM GMT
స్మార్ట్‌ సిటీలో రోబో పోలీస్..!

ముఖ్యాంశాలు

  • స్మార్ట్‌ సిటీ విశాఖలో స్మార్ట్‌ పోలీస్ సేవలు
  • ఫిర్యాదులు స్వీకరించేందుకు 'మిస్‌ సైబారా'ను ఏర్పాటు చేసిన పోలీసులు
  • పైలట్‌ ప్రాజెక్టు కింద మహరాణిపేట పోలీస్‌ స్టేషన్‌లో రోబో సేవలు

విశాఖపట్నం : అందమైన, చూడ ముచ్చటైన విశాఖ నగరంలో కొత్తగా ఒక మరమనిషి పుట్టుకొచ్చాడు. అలాంటిలాంటి మరమనిషికాదండోయ్.. నేరాలను అదుపుచేయగలిగిన సత్తా ఉన్న పోలీస్ మరమనిషి.. మహారాణిపేట పోలీస్టేషన్లో ఠీవీగా నుంచున్న ఈ మరమనిషి వచ్చిన ఫిర్యాదునల్లా బీరుపోకుండా తీసుకుని అన్నీ జాగ్రత్త చేసేస్తాడు. ఠంచనుగా స్టేషన్ అధికారికి పూర్తి స్థాయిలో సమాచారాన్ని నివేదిస్తాడు.

సంచలనాలకు వేదికైన విశాఖ మహానగరం ఈసారి సాంకేతిక పెను సంచలనానికి వేదికయ్యింది. వైజాగ్ పోలీసులు సైబిరా అనే పేరు కలిగిన సైబర్ సెక్యూరిటీ ఇంటరాక్టివ్ రోబోను మహారాణిపేట పోలీస్టేషన్ లో నిలబెట్టారు. రోబో కౌప్లల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఈ సరికొత్త రోబోను తయారుచేసి పోలీస్ శాఖకు అందించింది.

ఈ స్టేషన్ కు వచ్చిన బాధితులెవరైనాసరే ఇకపై అధికారుల అనుగ్రహంకోసం పడిగాపులు పడాల్సిన పనిలేదు. నేరుగా ఈ రోబో ఎదురుగా నుంచోవడం, తమ బాధల్ని ఈ రోబోకు చెప్పుకోవడం, ఫిర్యాదును మౌఖికంగా నమోదు చేయడం చాలా సులువైన పని. ఫిర్యాదుదారుల సౌకర్యార్ధం ప్రత్యేకంగా ప్రయోగాత్మకంగా ఈ స్టేషన్ లో ఈ రోబోను ఏర్పాటు చేసినట్టుగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ తెలిపారు.

Img 20191120 095747

ఇంతకు ముందు ఇలాంటి పోలీస్ రోబోలను కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. విశాఖలో మహారాణిపేట పోలీస్టేషన్ లో ఏర్పాటు చేసిన రోబోకి ఎక్ట్రార్డినరీ సూపర్ కాప్ క్వాలిటీస్ పుష్కలంగా ఉన్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ రోబో కేవలం ఫిర్యాదుల్ని స్వీకరించడం మాత్రమే కాక బాంబుల్ని, అనుమానాస్పద వస్తువుల్ని చాలా తేలిగ్గా గుర్తించగలగడం విశేషం.

అప్పుతీసుకుని ఎగ్గొట్టిన వ్యక్తి గురించి దాఖలు చేసిన ఫిర్యాదు ఈ రోబో స్వీకరించిన మొదటి ఫిర్యాదుగా నమోదయ్యింది. యాభై వేల రూపాయలు అప్పుతీసుకుని ఓ వ్యక్తి బాకీని ఎగ్గొట్టాడని ఫిర్యాదుదారు ఈ రోబోకి కంప్లైంటిచ్చాడు. నిజానికి ఈ ఫిర్యాదు సివిల్ కేసుకు సంబంధించింది కనుక పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదని పోలీస్ అధికారులు తెలిపారు.

స్మార్ట్‌ సిటీ విశాఖలో రోబో పోలీస్ సేవలు

ఒకసారి ఈ రోబో ఫిర్యాదును స్వీకరించిన తర్వాత నేరుగా ఫిర్యాదిదారుకు, సంబంధిత పోలీస్ అధికారికి సదరు కంప్లైంట్ కి సంబంధించిన లిఖితపూర్వక వివరాలు అందుబాటులోకి వస్తాయి. ఫిర్యాదును స్వీకరించిన 24 గంటల్లోపుగా సంబంధిత పోలీస్ అధికారి నిబంధనల ప్రకారం విచారణ చేపట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన పురోగతినికూడా అధికారికంగా నమోదు చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆటోమేటిగ్గా ఆ ఫిర్యాదును ఈ రోబో నేరుగా ఉన్నతాధికారులకు, డిజిపికి అందజేస్తుంది.

ప్రస్తుతం సైబీరియా ప్రయోగాత్మక పర్యవేక్షణలో ఉందని అధికారులు చెబుతున్నారు. వైజాగ్ లో ఇంకా కొన్ని పోలీస్టేషన్లలో ఇలాంటి రోబోలను ఏర్పాటు చేసి వీటి పనితీరును పూర్తిగా పరీక్షిస్తామని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఈ పోలీస్ రోబోతో ఇంకో సౌకర్యంకూడా ఉందండోయ్.. ఎప్పటికప్పుడు ఫిర్యాదిదారు నేరుగా పోలీస్టేషన్ కు వచ్చి వివరాలను ఎంటర్ చేసి తాను చేసిన ఫిర్యాదుకు సంబంధించిన విచారణ పురోగతిని గురించి కూడా తెలుసుకోవచ్చు.

Img 20191120 095752

కొత్త సాంకేతిక పరిజ్ఞానం

కేరళలో ఏర్పాటుచేసిన పోలీస్ రోబోకు ముఖ కవళికలను గుర్తించి అధికారులను, విజిటర్స్ ని కలుసుకోవడం, వాళ్లతో సంభాషణలు జరపడం లాంటి అదనపు బాధ్యతల్నికూడా అప్పగించారు. ఫిర్యాదిదారు పోలీస్టేషన్ కి వచ్చినప్పుడు ఏ అధికారిని కలవాలోకూడా తెలిపే బాధ్యత ఈ రోబో పోలీస్ దే. ఆ పోలీస్టేషన్ లో అందే సేవల గురించి, వాటికి సంబంధించిన అధికారుల గురించి పూర్తి స్థాయి సమాచారాన్ని అందిస్తాయి ఈ పోలీస్ రోబోలు. ఆ సమాచారానికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు రోబోకు ఉన్న స్క్రీన్ పై కనిపించడంకూడా ఒక ప్రత్యేకత. ఎప్పటికప్పుడు విజిటర్స్ వివరాలనుకూడా పూర్తి స్థాయిలో ఇవి భద్రపరుస్తాయి.

ఇలాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఒక్కో రోబో పోలీస్ ను తయారు చేసేందుకు రోబో కోప్లర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎనిమిది లక్షల రూపాయల్ని ఖర్చుపెట్టింది. పోనుపోనూ దీనికి మరిన్ని ఆధునిక సౌకర్యాలను జోడించే యోచనలో ఉందీ సంస్థ. అంటే ఒక్కసారి ఒక వ్యక్తి పోలీస్టేషన్ కి వస్తే అతనికి కావాల్సిన అన్ని సౌకర్యాలనూ పూర్తి స్థాయిలో ఈ రోబోద్వారా పొందే అవకాశం ఉంటుందన్నమాట.Next Story
Share it