Vizag: రుషికొండ బీచ్‌కు ఎంట్రీ ఫీజు
జూలై 11 నుండి రుషికొండ బీచ్‌లో సందర్శకులు రూ. 20 ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుందని పర్యాటక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
By అంజి Published on 9 July 2023 10:08 AM ISTVizag: రుషికొండ బీచ్‌కు ఎంట్రీ ఫీజు
విశాఖ పర్యటక ప్రదేశాల్లో రుషికొండ బీచ్ ఒకటి. ఈ బీచ్ కు పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. జూలై 11 నుండి రుషికొండ బీచ్‌లో సందర్శకులు రూ. 20 ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుందని పర్యాటక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఈ రుసుము నుండి మినహాయింపు ఉంటుంది. గతంలో, ఈ బీచ్‌కి సందర్శకులకు ఎలాంటి ప్రవేశ రుసుము ఉండేది కాదు. దేశంలోని 12 బీచ్‌లలో ప్రతిష్టాత్మకమైన 'బ్లూ ఫ్లాగ్' సర్టిఫికేషన్‌ను అందుకున్న వాటిలో రుషికొండ బీచ్ ఒకటి అని పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు శ్రీనివాస్ పాణి వివరించారు.
బీచ్ క్లీనర్లు, లైఫ్‌గార్డ్‌లు, సెక్యూరిటీ గార్డుల నెలవారీ వేతనాలు, మౌలిక సదుపాయాల నిర్వహణతో పాటుగా నెలకు సుమారుగా రూ.6 లక్షల వరకు ఖర్చులు ఉంటాయి. అనేక ఇతర బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు బీచ్ నిర్వహణ కోసం సందర్శకులకు రూ.20 నుండి రూ.50 వరకు వసూలు చేస్తున్నాయి. రుషికొండ బీచ్‌ను రూ. 2.5 కోట్లతో అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ ఇటీవల టెండర్లు పిలిచింది. అయితే ప్రస్తుతం పార్కింగ్ ఫీజు మినహా ఆ శాఖకు ఎలాంటి ఆదాయ మార్గాలు లేవు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
విశాఖలో ఇప్పటి వరకూ ఏ బీచ్‌లో టికెట్లు అమల్లో లేవు కానీ కొత్తగా రుషికొండ బీచ్‌లో టికెట్లు అమల్లోకి తీసుకువచ్చారు. రుషికొండ బీచ్‌లోకి వెళ్లడానికి టికెట్ కొనుగోలు చేసినవారు తాగునీరు, టాయిలెట్లు, స్విమ్మింగ్ జోన్, ఆటస్థలం వినియోగించుకోవచ్చ. రుషికొండ బీచ్‌కు ఎదురుగా ఉన్న కొండపై ప్రభుత్వం భారీ భవనాలు నిర్మిస్తోన్న విషయం తెలిసింది. అది సీఎం క్యాంప్ కార్యాలయం అన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అటువైపు సందర్శకుల్ని వీలైనంత వరకూ తగ్గించే ఉద్దేశంతోనే.. ఇలాంటి టిక్కెట్ భారాలను మోపుతున్నారని.. ముందు ముందు సందర్శకులపై మరిన్ని ఆంక్షలు విధిస్తారన్న ప్రచారం జరుగుతోంది.