రౌడీ షీటర్ల నగర బహిష్కరణకు వైజాగ్ పోలీసుల ప్లాన్
Vizag police plans to expel active rowdy sheeters from city. విశాఖపట్నం: యాక్టివ్‌గా ఉన్న కొంతమంది రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరించేందుకు వైజాగ్ సిటీ పోలీసులు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 July 2022 11:30 AM ISTవిశాఖపట్నం: యాక్టివ్‌గా ఉన్న కొంతమంది రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరించేందుకు వైజాగ్ సిటీ పోలీసులు యోచిస్తున్నారు. వైజాగ్ నగరంలోని రౌడీషీటర్ల ఆలోచనా ధోరణిని మార్చేందుకు పదే పదే కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నప్పటికీ, వారిలో కొందరు గంజాయి స్మగ్లింగ్, ప్రత్యర్థి ముఠాలపై దాడులు, దోపిడీ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతూనే ఉన్నారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. గత కొన్నేళ్లుగా కొత్త రౌడీషీటర్లు జాబితాలోకి చేర్చబడ్డారు, అయితే జాబితా నుండి చాలా తక్కువ మంది పేర్లు తొలగించబడ్డాయి.
కొద్ది రోజుల క్రితం.. సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇద్దరు రౌడీషీటర్లు ధోని సతీష్, పి.గౌరీ సాయి సహా ఐదుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి 25 కిలోల ఎండు గంజాయి, ఆరు మొబైల్ ఫోన్లు, డమ్మీ పిస్టల్, కత్తిని పోలీసులు ఆనందపురంలో స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్రమాలకు పాల్పడుతున్న ఏడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
రౌడీషీటర్ల కార్యకలాపాలపై నిఘా పెట్టామని నగర పోలీస్ చీఫ్ సిహెచ్. శ్రీకాంత్ తెలిపారు. రౌడీషీటర్ల బహిష్కరణపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఏసీపీ (టాస్క్ ఫోర్స్) ఎ. త్రినాథ్ రావు మాట్లాడుతూ.. వైజాగ్ నగరంలో 500 మందికి పైగా రౌడీషీటర్లు ఉన్నారని, వారిని "యాక్టివ్", "రెగ్యులర్"గా వర్గీకరించామని చెప్పారు. ప్రస్తుతం 90 మంది రౌడీ షీటర్లు యాక్టివ్‌గా ఉన్నారని చెప్పారు.
తాజాగా విజయవాడలో ఐదుగురు రౌడీ షీటర్లను బహిష్కరించారు. బెవర శ్రీను అలియాస్ పిల్ల శ్రీను, మాచర్ల బాల స్వామి అలియాస్ పాండు, బాణావతు శ్రీను నాయక్, మల్లవరపు విజయ్ కుమార్ అలియాస్ మసాలం, కట్ల కాళిలను బహిష్కరిస్తూ విజయవాడ పోలీస్ కమిషనర్ కంఠీ రాణా టాటా ఉత్తర్వులు జారీ చేశారు.
ఐదుగురు వరుస నేర కార్యకలాపాలకు పాల్పడ్డారు. అరెస్టు చేసి జైలుకు పంపబడ్డారు. అయితే జైలు నుండి విడుదలైన తర్వాత కూడా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. మరో ఇద్దరు రౌడీ షీటర్లు తుమ్మల మనోజ్, మటపర్తి దుర్గాప్రసాద్‌లను కూడా బహిష్కరించారు. ఇప్పటి వరకు మొత్తం ఏడుగురు రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరించారు.
యాక్టివ్, రెగ్యులర్ రౌడీ షీటర్లకు వారి తీరు మార్చుకోవాలని కౌన్సెలింగ్ ఇస్తున్నామని, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా వారిని హెచ్చరించామని వైజాగ్ పోలీసులు తెలిపారు. "మేము ఎంత ప్రయత్నించినప్పటికీ, కొంతమంది రౌడీషీటర్లు తమ వైఖరిని మార్చుకోవడం లేదు. చట్టవిరుద్ధ పనులకు పాల్పడుతూనే ఉన్నారు. పేరుమోసిన రౌడీ షీటర్లను నగరం నుండి బహిష్కరించడంతో పాటు వారి కార్యకలాపాలను అరికట్టడానికి మేము కొత్త వ్యూహాలను రచిస్తున్నాము. బహిష్కరణ తరువాత, రౌడీ- పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా కొన్ని నెలల పాటు షీటర్లు వైజాగ్ నగరంలోకి ప్రవేశించలేరు. నగరంలోకి ప్రవేశిస్తే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తాం'' అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.