క్షుద్రపూజల పేరుతో భక్తులకు శఠగోపం.. బంగారం స్వాహా
విశాఖలో ఓ అర్చకుడు క్షుద్రపూజల పేరుతో భక్తులకు శఠగోపం పెట్టాడు.
By Srikanth Gundamalla Published on 17 Sept 2023 11:48 AM ISTక్షుద్రపూజల పేరుతో భక్తులకు శఠగోపం.. బంగారం స్వాహా
టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రతి దానికి సైన్స్‌ను అటాచ్ చేసి చూస్తున్న కాలం ఇది. ప్రతి అంశానికి థియరీ ఉంటుంది. అయితే.. ఇప్పటికీ కొందరు మూఢనమ్మకాలను వదలడం లేదు. మాయమాటలకు పడిపోయి క్షుద్రపూజలు అనగానే భారీగా డబ్బులు సమర్పించుకుంటున్నారు. తాజాగా.. విశాఖలో ఓ అర్చకుడు క్షుద్రపూజల పేరుతో భక్తులకు శఠగోపం పెట్టాడు. క్షుద్రపూజలు చేస్తానని నమ్మించి అందినకాడికి నొక్కేశాడు.
విశాఖపట్నంలోని భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తగరపువలసలో మాయమాటలతో భక్తులకు అర్చకుడు శఠగోపం పెట్టాడు. క్షుద్రపూజలు చేస్తానంటూ నమ్మించి కొందరి నుంచి 48 తులాల వరకు బంగారం స్వాహా చేశాడు. అయితే. తగరపువలస సాయిబాబా గుడిలో అర్చకుడిగా ఉన్న శ్రీను గారడిని అక్కడికి వచ్చే కొందరు భక్తులు నమ్మారు. గుడికి వచ్చే భక్తుల బలహీనతలు తెలుసుకుని వాటి ఆధారంగా నమ్మించి మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఓ భక్తురాలిని కూడా నమ్మించాడు. సుబారు 48 తులాల బంగారానికి ఎసరు పెట్టాడు.
అయితే.. మహిళకు సాయం చేస్తామని మొత్తం 48 తులాల బంగారం నొక్కేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన భీమిలీ పోలీసులు విచారణ చేపట్టారు. అయితే.. నిందితుడు శ్రీను దొరికిపోతానని గ్రహించి బంగారాన్ని బ్యాంకుల్లో తనఖా పెట్టి డబ్బులు తీసుకున్నాడు. ముత్తూట్ ఫైనాన్స్,పెడరల్ బ్యాంకులో స్వాహా చేసిన బంగారాన్ని తనఖా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు బంగారం రికవరీ చేయడానికి ఆయా బ్యాంకులకు లేఖలు రాసినట్లు చెప్పారు. అయితే.. నిందితుడు బ్యాంకుల్లో 30 తులాల బంగారమే తనఖా పెట్టాడని పోలీసులు వెల్లడించారు. శ్రీనుకి మరో ఇద్దరు కూడా సహకరించారని పోలీసులు చెబుతున్నారు. విచారణ కొనసాగుతోందని త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మరోవైపు రికవరీ విషయంలో అవినీతి జరిగిందని బాధితురాలు ఆరోపిస్తున్నది. ఈ కేసు విషయంలో విశాఖ సీపీ చొరవ తీసుకోవాలని కోరుతోంది. ఉన్నతాధికారులు స్పందిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు.