మూడు రాజధానులకు మద్దుతుగా అధికార వైసీపీ ఆధ్వర్యంలో రాజకీయేతర ఐకాస విశాఖ గర్జన పేరుతో చేపట్టిన ర్యాలీ శనివారం ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకే ప్రారంభం కావాల్సి ఉండగా.. విశాఖ నగరంలో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో గంటన్నర ఆలస్యంగా ఎల్ఐసీ జంక్షన్ నుంచి ప్రారంభమైంది. వర్షం పడుతున్నప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రమంత్రులు రోజా, రజిని, ముత్యాల నాయుడు, అమర్నాథ్, స్పీకర్ సీతారాం, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, శ్రీవాణి, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.
ర్యాలీ పొడవునా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. డప్పు కళాకారులు, నృత్యాలతో ర్యాలీ సందడిగా సాగుతోంది. మూడు రాజధానులు ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో విశాఖ వీధులన్నీ హోరెత్తుతున్నాయి. ఎల్ఐసీ జంక్షన్ నుంచి మొదలైన ర్యాలీ, విశాఖ పార్క్ హోటల్ జంక్షన్‌ను చేరుకోనుంది. అనంతరం హోటల్ వద్దనున్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభను నిర్వహించనున్నారు. ర్యాలీ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.