మరో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యం
Two more Dead bodies of students found in Pudimadaka Beach.అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో సముద్రంలో గల్లంతైన
By తోట వంశీ కుమార్ Published on 30 July 2022 9:44 AM ISTఅనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో సముద్రంలో గల్లంతైన విద్యార్థుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న ఓ విద్యార్థి మృతదేహం ఒడ్డుకు కొట్టుకురాగా.. నేడు మరో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. నేవీ హెలికాఫ్టర్ సాయంతో మృతదేహాలను ఒడ్డుకు తరలించారు. మృతులను మునగపాకకు చెందిన గణేష్, గోపాలపట్నానికి చెందిన జగదీశ్‌గా గుర్తించారు. గల్లంతు అయిన మిగిలిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
అనకాపల్లి పట్టణంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 12 మంది విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలు రాసిన అనంతరం శుక్రవారం మధ్యాహ్నం బైక్‌లపై పూడిక మడక బీచ్‌కి వచ్చారు. అందరూ అక్కడ సెల్ఫీలు దిగారు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో వారిలో ఏడుగురు సముద్రంలో స్నానానికి దిగారు. కేరింతలు కొడుతూ స్నానాలు చేస్తుండగా ఉవ్వెత్తున వచ్చిన రాకాసి అలలు సముద్రంలోకి వారిని లాగేశాయి. గట్టుపైన ఉన్న మిగిలిన విద్యార్థులు కేకలు వేయడంతో స్థానిక మత్స్యాకారులు పరుగున వచ్చారు. విద్యార్థులను రక్షించే ప్రయత్నం చేశారు. మునగపాకకు చెందిన సూరిశెట్టి తేజను ఒడ్డుకు తీసుకురాగా.. కొన ఊపిరితో ఉన్న అతనిడి విశాఖ కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పోలీసులు, అగ్నిమాపక, కోస్ట్‌గార్డ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. నిన్న రాత్రి చీకటి పడటంతో గాలింపు ఆపేసిన అధికారులు.. ఈ రోజు ఉదయాన్నే తిరిగి మొదలుపెట్టారు.