పండ‌గ పూట విశాఖ‌లో విషాదం.. కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురు మృతి

విశాఖ న‌గ‌రంలో విషాదం చోటు చేసుకుంది. క‌లెక్ట‌రేట్‌కు స‌మీపంలోని రామ‌జోగిపేటలో గ‌ల మూడు అంత‌స్తుల భ‌వ‌నం కుప్ప‌కూలింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 March 2023 2:57 AM GMT
Building collapsed, Visakhapatnam

స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన రెస్య్కూ సిబ్బంది

తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది పండుగ పూట విశాఖ న‌గ‌రంలో విషాదం చోటు చేసుకుంది. క‌లెక్ట‌రేట్‌కు స‌మీపంలోని రామ‌జోగిపేటలో గ‌ల మూడు అంత‌స్తుల భ‌వ‌నం కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మ‌ర‌ణించారు. మ‌రో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

గురువారం తెల్ల‌వారుజామున రెండు గంట‌ల స‌మ‌యంలో మూడు అంత‌స్తుల భ‌వ‌నం ఒక్క‌సారిగా కుప్ప‌కూలింది. ఆ స‌మ‌యంలో అంద‌రూ గాఢ నిద్రలో ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌లో 14 ఏళ్ల సాకేటి అంజ‌లి, ఆమె సోద‌రుడు దుర్గాప్రసాద్‌(17) ల‌తో పాటు బిహార్ రాష్ట్రానికి చెందిన చోటు(27) మ‌ర‌ణించారు. కొమ్మిశెట్టి శివశంకర్, సాకేటి రామారావు, సాకేటి కళ్యాణి, సున్నపు కృష్ణ, సాతిక రోజారాణిలు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

భ‌వ‌నం కుప్ప‌కూలింది అన్న స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాయి. గాయ‌ప‌డిన వారిని కేజీహెచ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా ఎవ‌రైనా శిథాలాల కింద చిక్కుకుని ఉంటారేమోన‌న్న అనుమానంతో స‌హ‌య‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. మృతురాలు సాకేటి అంజ‌లి నిన్న‌నే(బుధ‌వారం) పుట్టిన రోజు జ‌రుపుకుంది. అంత‌లోనే ప్రాణాలు కోల్పోయింది.

Next Story