శీతాకాలంలో వైజాగ్‌లోని ఈ ప్రదేశాలను సందర్శించండి

The mountains are calling This winter visit these places in Vizag.విశాఖ‌ప‌ట్నంలో ఎన్నో ప‌ర్యాట‌క ప్రాంతాలు ఉన్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Nov 2022 9:33 AM GMT
శీతాకాలంలో వైజాగ్‌లోని ఈ ప్రదేశాలను సందర్శించండి

విశాఖపట్నం : శీతాకాలం ప్రారంభ‌మైంది. చ‌ల్ల‌ని గాలులు వీస్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో చాలా మంది ప‌ర్యాట‌క ప్రాంతాలను సంద‌ర్శించాల‌ని అనుకుంటారు. అయితే.. ఇందుకోసం వేరే దేశాలు, రాష్ట్రాలు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. మ‌న ద‌గ్గ‌రే చాలా అంద‌మైన ప్ర‌దేశాలు ఉన్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ‌ప‌ట్నంలో ఎన్నో ప‌ర్యాట‌క ప్రాంతాలు ఉన్నాయి. చుట్టూ ద‌ట్ట‌మైన చెట్లూ వాటి మ‌ధ్య‌లో ప‌ర్య‌తాలు, ఈ ప‌ర్వ‌తాల‌ను తాకే మేఘాలు, చ‌ల్లటి గాలుల‌తో కూడిన‌ అక్క‌డి ప్రాంతాల్లో ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉండ‌డంతో ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి.

శీతాకాలంలో అరకు, పాడేరు, వంజంగి, లంబసింగి సహా ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త‌లు బాగా ప‌డిపోతుంటాయి. ఈ స‌మ‌యంలో ఇక్క‌డి ప‌ర్య‌తాలు, మేఘాలను వీక్షించి తీరాల్సిందే. ఆ స‌మ‌యంలో మ‌న‌స్సుకు క‌లిగే ఆనంద‌మే వేరు. ఈ సౌంద‌ర్య దృశ్యాల‌ను చూసేందుకు గ‌త కొన్ని సంవ‌త్స‌రాలు ప‌ర్యాట‌కులు పోటెత్తున్నారు.

ప‌ర్యాట‌కుల కోసం NewsMeter విశాఖపట్నంలోని కొన్ని చక్కని ప్రదేశాల జాబితాను సిద్దం చేసింది. ప్రతి పర్వతారోహకుడు, ట్రెక్కర్, కొత్త ప్రదేశాలను అన్వేషించాలనుకునే వారు ఇక్కడకు వెళ్లవచ్చు.

తారాబు జలపాతాలు :

అరకు నుండి పాడేరు మీదుగా సుమారు 120 కి.మీ దూరం ప్ర‌యాణిస్తే ఈ తారాబు జ‌ల‌పాతాన్ని చేరుకోవ‌చ్చు. కొండ ప్రాంతం కావ‌డంతో ప్ర‌యాణం కొంత క‌ష్టంగానే ఉంటుంది. అయిన‌ప్ప‌టికి జ‌ల‌పాతాల‌ను చూడాల‌నుకునే వారు సంద‌ర్శించాల్సిన ఉత్త‌మ ప్ర‌దేశం ఇది. ఈ జ‌ల‌పాతానికి వెళ్లే దారిలో చుట్టూ ప‌చ్చ‌ద‌నం, చిన్న చిన్న జల‌పాతాలు మ‌నోహ‌రంగా క‌నిపిస్తాయి.


లంబసింగి :

'ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్' అని పిలవబడే లంబసింగి చింతపల్లి మండలంలో ఉన్న ఒక చిన్న గ్రామం. సముద్ర మట్టానికి 1,000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ గ్రామంలో రాష్ట్రంలోనే అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతాయి. ఈ ప్రదేశంలో ఒకప్పుడు టెంట్లు లేదా వసతి సౌకర్యాలు లేవు కానీ ఇప్పుడు హోటళ్ళు, టెంట్లు, తినుబండారాలతో నిండిపోయింది. లంబసింగిలో స్ట్రాబెర్రీ కోయడం పర్యాటకులలో బాగా ప్రసిద్ధి చెందింది. గిరిజనులు తయారుచేసే తేనె కూడా చాలా ప్రసిద్ధి చెందింది. మీరు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తున్నట్లయితే.. సాయంత్రం అక్క‌డే ఉంటే బాగుంటుంది. గుడారాలలో బ‌స చేస్తూ రాత్రి నక్షత్రాలను చూడటం, పొగమంచుతో కూడిన ఉదయాలను ఆస్వాదిస్తే అద్భుతంగా ఉంటుంది.


వంజంగి :

'మేఘాల మహాసముద్రం' (మేఘ సముద్రం)గా పిలువబడే వంజంగిలో చలికాలంలో 3 నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇది చాలా కష్టమైన ట్రెక్. నగరం నుండి 100 కి.మీ, పాడేరు నుండి 6 కి.మీ దూరంలో ఉన్న వాన్టేజ్ పాయింట్ చేరుకోవడానికి వైజాగ్ నగరం నుండి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అడవుల గుండా 5 నుంచి 6 కి.మీ నడక థ్రిల్లింగ్ అనుభవం. ఈ సీజన్‌లో.. సందర్శకులను సాయంత్రం 5 గంటల తర్వాత అనుమతించరు. తెల్లవారుజామున 3 గంటల తర్వాత మాత్రమే వెళ్లవచ్చు, వంజంగి కొండల్లో మద్యం మరియు ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధించబడింది.


యారాడ బీచ్ :

యారాడ బీచ్‌ను సందర్శించే చాలా మంది ప్రజలు నీలి జలాలను చూడటానికి వెళతారు. అయితే మీలో ఎంతమంది యారాడ కొండకు ట్రెక్కింగ్ చేశారు? యారాడ కొండపై కూర్చుని బంగాళాఖాతం చూస్తే స్వర్గపు ముక్కలా ఉంటుంది. మీరు కొండపై ట్రెక్కింగ్ చేయడానికి ఒక మార్గాన్ని కనుగొనవచ్చు. చాలా ప్రమాదకరం కానీ స్నేహితులతో కలిసి వెళ్లడం, పైభాగంలో కూర్చోవడం, నీలి నీళ్లను చూడటం సరదాగా ఉంటుంది.


పాడేరు :

వైజాగ్ అంటే కొండలు, జలపాతాలే కాదు సుందరమైన రోడ్లు కూడా. మనలో చాలా మందికి విశాఖపట్నంలో సుందరమైన రోడ్లు ఉన్నాయని, అందులో పాడేరు ఒకటి అని తెలియదు. నర్సీపట్నం మీదుగా పాడేరు చేరుకోవడానికి 3 గంటల సమయం పడుతుంది. పాడేరుకు వెళ్లే రహదారి ఫోటోషూట్‌ల కోసం కొన్ని ప్రాంతాలు స‌రిగ్గా స‌రిపోతాయి. రద్దీ ఎక్కువగా లేకపోవడంతో చాలా మంది ఘాట్‌ రోడ్డు మధ్యలో ఫొటోలు కూడా దిగుతున్నారు.


Next Story