విశాఖలో న్యూ ఇయర్ నిబంధనలు ఇవే
Strict Rules for New Year Celebrations in Vizag
By తోట వంశీ కుమార్ Published on 31 Dec 2021 1:17 PM ISTకొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్దమవుతున్నారు. అయితే.. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. కొత్త సంవత్సరం వేడుకలకు షరతులతో కూడిన అనుమతులు మంజారు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు ఉన్నాయి. ఇక విశాఖపట్నంలో కొత్త సంవత్సరం వేడుకలపై సిటీ పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి నుంచే బీచ్‌లో వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు.
దీంతో కొత్త సంవత్సరం వేడుకలను సరదాగా బీచ్ లో నిర్వహిద్దామనుకున్న వారికి మరోసారి నిరాశే ఎదురైంది. డిసెంబర్ 31 శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి జనవరి 1 ఉదయం 6 గంటల వరకు బీచ్ రోడ్డులో ఆంక్షలు అమల్లో ఉండనున్నారని పోలీసులు తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నేవల్ కోస్ట్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు బీచ్ రోడ్‌లో అన్ని రకాల వాహనాల రాకపోకల నిషేధం విధించారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్లను మూసివేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా బీఆర్‌టీఎస్ రోడ్ హనుమంతవాక నుంచి అడవివరం జంక్షన్, గోశాల జంక్షన్ నుంచి వేపగుంట జంక్షన్, పెందుర్తి జంక్షన్ నుంచి ఎన్ఏడీ జంక్షన్ మీదుగా కాన్వెంట్ జంక్షన్ వరకు మధ్య రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రహదారులను మూసివేయనున్నట్లు ట్రాఫిక్ ఏడీసీపీ ఆదినారాయణ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇక తాగి వాహనాలు నడిపే వారిపై, స్పీడ్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రహదారులపై పోలీసుల ప్రత్యేక పహారా ఉంటుందని చెప్పారు. ఇక రెస్టారెంట్లు, బార్లు, హోటల్స్, షాప్ లు ప్రభుత్వ నిభందనల మేరకు వారికి కేటాయించిన సమయం వరకే తెరిచిఉంచాలన్నారు. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.