మిస్సింగ్ మిస్టరీ వీడింది.. విశాఖ బీచ్‌లో అదృశ్యం.. నెల్లూరులో ప్రత్యక్షం
Saipriya Missing mystery Solved.విశాఖట్నం ఆర్కే బీచ్‌లో సోమవారం సాయంత్రం అదృశ్యమైన వివాహిత సాయిప్రియ కేసు మిస్టరీ
By తోట వంశీ కుమార్ Published on 27 July 2022 7:52 AM GMTవిశాఖట్నం ఆర్కే బీచ్‌లో సోమవారం సాయంత్రం అదృశ్యమైన వివాహిత సాయిప్రియ కేసు మిస్టరీ వీడింది. ఈ కేసును సవాలుగా తీసుకున్న విశాఖ పోలీసులు కేసును చేధించారు. విశాఖ బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ.. ప్రియుడితో నెల్లూరులో ఉన్నట్లు గుర్తించారు. నెల్లూరు చెందిన రవితో సాయి ప్రియ కొన్నాళ్లుగా ప్రేమ వ్యవహారం నడుపుతోంది.
వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస్, సాయి ప్రియ కు రెండేళ్ల క్రితం వివాహమైంది. శ్రీనివాస్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా సాయి ప్రియ.. అమ్మగారి ఇంటి వద్ద ఉంటూ ఎన్ఏడీ వద్ద ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఈ నెల 25 సోమవారం పెళ్లి రోజు కావడంతో ఉదయం సింహాచలం గుడికి వెళ్లి మధ్యాహ్నాం ఇంటికి వచ్చారు. అనంతరం సాయంత్రం ఆర్కే బీచ్ కు వెళ్లారు. ఇద్దరూ కాసేపు అక్కడ ఫోటోలు దిగుతూ కాలక్షేపం చేశారు. రాత్రి 7.30గంటల సమయంలో తిరిగి వెళ్లేందుకు సిద్దం అయ్యారు. ఇంతలో శ్రీనివాస్‌కు సెల్‌ఫోన్‌కు మెసేజ్ రావడంతో అతడు మేసేజ్ చూస్తుంటూ రోడ్డు వైపుకు వచ్చినట్లు ఫిర్యాదులో శ్రీనివాస్ తెలిపాడు. ఆ సమయంలో కాళ్లు కడుక్కోవడానికి వెళ్లిన తన భార్య తన వెనుకనే వస్తుందని బావించినట్లు అతడు చెప్పాడు. వెనక్కి తిరిగి చూస్తే తను కనిపించలేదని, ఆమె కోసం చాలా సేపు వెతికినట్లు తెలిపాడు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయి ప్రియ సముద్రంలోకి జారి గల్లంతు అయ్యిందేమోన్న అనుమానంతో గజఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. రెండు కోస్ట్‌గార్డ్ గస్తీ నౌకలతోపాటు హెలికాప్టర్ ద్వారా ముమ్మరంగా గాలించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో భర్త శ్రీనివాస్‌పైనే అందరిలో అనుమానం మొదలైంది. పోలీసులు రకరకాలుగా శ్రీనివాస్‌ను ప్రశ్నించినప్పటికీ అతడు ఫిర్యాదులో పేర్కొన్న విధంగా చెప్పడంతో ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. ఎట్టకేలకు సాయిప్రియ.. ప్రియుడితో నెల్లూరులో ఉన్నట్లు గుర్తించారు. భర్తపై అనుమానం కలిగేలా చేసి సాయి ప్రియ ఆర్కే బీచ్ నుంచి అదృశ్యమైంది.