కదులుతున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేయగా.. ప్రయాణీకులు కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. మంగళవారం రాత్రి ఈ ఘటన విశాఖ నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. 400 N నంబర్ గల ఆర్టీసీ బస్సు పరవాడ మండలం వాడచీపురుపల్లి నుంచి విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌కు బయలుదేరింది. బస్సు కాన్వెంట్ కూడలి పై వంతెన వద్దకు రాగానే బస్సు వెనుక టైరు నుంచి పొగలతో పాటు మంటలు వచ్చాయి. ఈ విషయాన్ని కండక్టర్ గుర్తించాడు. వెంటనే డ్రైవర్ బస్సును నిలిపివేసి ప్రయాణీకులను కిందకు దించారు. ఆ సమయంలో బస్సులో 50 మంది ప్రయాణీకులు ఉన్నారు.
పోలీసులకు సమాచారం అందించారు. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. అదే సమయంలో ఓ లారీ గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో అటుగా వస్తుండగా.. హోంగార్డు గమనించి లారీని దూరంగా ఆపి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. రెండు ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. దాదాపు గంట పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.