వైసీపీపై పవన్ విమర్శనాస్త్రాలు.. చేతకాని వాళ్లు చట్టసభల్లో కూర్చోవడం ఎందుకు..?
Pawan Kalyan Speech in SangheebhavaDeeksha.విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన
By తోట వంశీ కుమార్ Published on 12 Dec 2021 1:04 PM GMTవిశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన సంఘీభావ దీక్ష ముగిసింది. జేఏసీ నేతలు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ ప్రభుత్వం తీరును ఎండగట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని పవన్ డిమాండ్ చేశారు.
పదవులు ఆశించకుండా సేవలు చేస్తేనే ప్రజలు ఆదరిస్తారన్నారు. తాము ప్రజాక్షేమం కోరుకునేవాళ్లమన్నారు. అందుకే ఈ రోజు గాజువాకలో ఓడిపోయినా, ఉత్తరాంధ్రలో గెలవలేకపోయినా, ఏపీలో మద్దతు సంపూర్ణంగా రానప్పటికీ కూడా ప్రజలకు అండగా ఉంటామన్నారు. ఇక అమరావతినే రాజధానిగా గుర్తిస్తామని మోడీ, అమిత్‌షా తనతో అన్నట్లు చెప్పారు. తనకు ప్రజాబలం ఉందని, కానీ చట్టసభల్లో బలం లేదన్నారు. వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారన్నారు.
బీజేపీ దగ్గర తన మాటకు గౌరవం ఉండొచ్చు కానీ.. 22 మంది ఎంపీల మాట కేంద్రానికి శాసనమని తెలిపారు. చేతకాని వ్యక్తులు చట్టసభల్లో కూర్చోవడం ఎందుకు? అని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ సభల్లో నిరసన తెలపాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అందరూ ఏకం కావాలన్నారు.
వైసీపీ నేతలు జనసేనకు శత్రువులు కాదని.. వారి విధానాలకు మాత్రమే వ్యతిరేకమన్నారు. పాలసీలు బాగోలేనప్పుడు ఖచ్చితంగా మాట్లాడతామని తెగేసి చెప్పారు. వ్యక్తిగత విమర్శలకు దిగడం తమ ఉద్దేశం కాదన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం 150 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. అందరూ కలిసి వైసీపీ నేతల చొక్కా పట్టుకుని నిలదీయకపోతే.. వాళ్లు మాట వినరు అని చెప్పారు. జనసేనకు మద్దతిస్తే తాను చేసి చూపిస్తానని పవన్ అన్నారు. 2024 ఎన్నికల వరకు వైసీపీ గూండాయిజం, బూతులు భరించాల్సిందేనన్నారు. ఆలోచించి ఓటు వేయకపోతే.. విలువ తెలియకుండా అమ్ముకుంటే ప్రజల స్వయంకృతాపరాధమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.