విశాఖ‌లో వందేభార‌త్ రైలు పై రాళ్ల దాడి

Miscreants pelt stones on yet to launch Sec'bad- Vizag Vande Bharat express.విశాఖ‌లో వందేభార‌త్ రైలు పై రాళ్ల దాడి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jan 2023 2:39 AM GMT
విశాఖ‌లో వందేభార‌త్ రైలు పై రాళ్ల దాడి

భార‌తీయ రైల్వే ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించింది. ఇప్ప‌టికే ప‌లు మార్గాల్లో ఈ రైలు న‌డుస్తుండ‌గా.. తెలుగు రాష్ట్రాల‌ను క‌లుపుతూ సికింద్రాబాద్‌- విశాఖ‌ప‌ట్నం మార్గంలో మ‌రికొన్ని రోజుల్లో ఈ రైలు అందుబాటులోకి రానుంది. అందులో భాగంగా ట్ర‌యిల్ ర‌న్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో విశాఖ‌ప‌ట్నంలో వందే భార‌త్ రైలు పై రాళ్ల దాడి జ‌రిగింది.

బుధవారం ఉదయం వందేభారత్ రైలు నిర్వహణ నిమిత్తం విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. రైల్వే అధికారులు ట్రయల్ రన్ ను నిర్వహించారు. సాయంత్రం 6 గంటల సమయంలో మర్రిపాపెం వద్ద మెయింటెనెన్స్ నిమిత్తం రైలు కోచ్ కేర్ సెంటర్‌కు వెళ్తుండగా కంచరపాలెం సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో కోచ్ అద్దాలు పగిలిపోయాయి.

ఘటన జరిగిన వెంటనే డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్ విచారణ ప్రారంభించారు. అధికారులు పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నిందితుల కోసం గాలిస్తోంది. ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. కాగా.. ఈ రైలును ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జ‌న‌వ‌రి 19న సికింద్రాబాద్‌లో జెండా ఊపి ప్రారంభించాల్సి ఉంది. అయితే.. ప‌లు కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది.


పూర్తిగా చైర్‌ కార్‌ బోగీలున్న ఈ రైలు ప్ర‌యాణీకుల‌ను అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఈ రైలు అందుబాటులోకి వ‌స్తే ప్ర‌యాణ స‌మ‌యం బాగా త‌గ్గ‌నుంది. ప్ర‌స్తుతం విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు 12 నుంచి 14 గంట‌లు ప‌డుతుంది. అదే వందే భార‌త్ రైలులో కేవ‌లం 8.40 గంట‌ల్లోనే గ‌మ్య‌స్థానాల‌కు చేరుకోవ‌చ్చు.

ఇదిలా ఉంటే.. వందేభారత్ రైలు సర్వీసులను తిరుపతి వరకు పొడిగించే అవకాశాలను కూడా ప‌రిశీలిస్తున్న‌ట్లు సమాచారం. సికింద్రాబాద్-తిరుపతి నుంచి రైలు నడపినట్లయితే, విజయవాడ నుండి ప్రయాణీకుల రద్దీ, సమయం తగ్గుతుంది.

వందే భారత్ రైళ్లు ప్రస్తుతం న్యూఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ-కత్రా, ముంబై సెంట్రల్-గాంధీనగర్, న్యూఢిల్లీ-అంబ్ అందౌరా మరియు MGR చెన్నై సెంట్రల్-మైసూరు మార్గాల్లో నడుస్తున్నాయి.

ఈ రైలు ప్ర‌త్యేక‌త‌లు

- ఇది ఏసీ రైలు. 16 కోచ్‌లతో 1,128 సీట్ల సామ‌ర్థ్యం క‌లిగి ఉన్నాయి.

- రైలులో అత్యాధునిక‌మైన బ్రేకింగ్ సిస్ట‌మ్ ఉంది. దీని వ‌ల్ల వేగ నియంత్ర‌ణ‌ మ‌రియు వేగాన్ని త్వ‌రిత‌గ‌తిన పెంచ‌డం సాధ్య‌మ‌వుతుంది.

-వందే భారత్ రైళ్లు గంటకు 0-100 కి.మీ వేగాన్ని కేవ‌లం 52 సెకన్లలో అందుకోగలవు, టాప్-అప్ వేగం గంటకు 180 కి.మీ.

-అన్ని కోచ్‌లలో ఆటోమేటిక్ డోర్లు, GPS ఆధారిత ఆడియో-విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లు మరియు దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలు ఉంటాయి.

-వినోద ప్రయోజనాల కోసం బోర్డులో హాట్‌స్పాట్ వైఫై సౌక‌ర్యం ఉంటుంది.

Next Story