KTR : కేంద్ర ప్ర‌భుత్వానికి మంత్రి కేటీఆర్ బ‌హిరంగ లేఖ‌.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌పై

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను ఆపాల‌ని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్ర‌భుత్వానికి బ‌హిరంగ లేఖ‌ను రాశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 April 2023 12:47 PM IST
Minister KTR, Vizag Steel Plant

కేంద్ర ప్ర‌భుత్వానికి మంత్రి కేటీఆర్ బ‌హిరంగ లేఖ‌

భార‌త్ రాష్ట్ర స‌మితి(బీఆర్ఎస్‌) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ కేంద్ర ప్ర‌భుత్వానికి బ‌హిరంగ లేఖ‌ను రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను ఆపాల‌ని అందులో డిమాండ్ చేశారు. కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానండి అని లేఖ‌లో పేర్కొన్నారు. వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు కేంద్రం కొత్త కుట్ర చేస్తుందని ఆరోపించారు.

స్టీల్‌ప్లాంట్‌కు అవసరమైన ప్రత్యేక ఐరన్ వోర్ గనులను కేటాయించకుండా కేంద్రం మోకాలడ్డిందన్నారు. దీంతో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ తన ఉత్పత్తి ఖర్చులో 60 శాతం వరకు పూర్తిగా ముడిసరుకుపైనే ఖర్చు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను అంతిమంగా నష్టాల్లోకి నెట్టి ప్రైవేటు ప‌రం చేయాల‌ని కేంద్ర బావిస్తోంద‌న్నారు.

కార్పొరేట్ల‌కు రూ.12.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన ప్రధానమంత్రి మోదీకి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పట్ల ఇదే ఔదార్యం ఎందుకు లేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రమే ఈ వర్కింగ్ కాపిటల్ కోసం ఆర్థిక సహాయం అందించి వైజాగ్ స్టీల్ నుంచి స్టీల్ ఉత్పత్తులు కొనాలన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా విస్తరణ ప్రణాళికల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీలీనాన్ని పరిశీలించాలని మంత్రి కేటీఆర్ కోరారు.

కేంద్ర ప్రభుత్వమే తక్షణం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి అవసరమైన మేరకు కనీసం రూ.5వేల కోట్లు కేటాయించాలని సూచించారు. గ‌తంలో పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానులుగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులను వైజాగ్ స్టీల్ ప్లాంట్ వడ్డీతో సహా తిరిగి ఇచ్చిందని గుర్తు చేశారు. లక్షన్నర కోట్ల రూపాయల విలువ కలిగిన స్టీల్ ప్లాంట్ ను అప్పనంగా ప్రైవేటు పరం చేసే కుట్రలను కేంద్రం ఆపాలన్నారు.

Next Story