విశాఖలో 'మెగా బీచ్ క్లీనింగ్'.. ప‌రిస‌రాల‌ను శుభ్రం చేసిన మంత్రులు

Mega Beach Cleaning program in Visakhapatnam.స‌ముద్ర తీరంలోని వ్య‌ర్థాల‌ను పూర్తిగా నిర్మూలించ‌డ‌మే ల‌క్ష్యంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Aug 2022 12:09 PM IST
విశాఖలో మెగా బీచ్ క్లీనింగ్.. ప‌రిస‌రాల‌ను శుభ్రం చేసిన మంత్రులు

స‌ముద్ర తీరంలోని వ్య‌ర్థాల‌ను పూర్తిగా నిర్మూలించ‌డ‌మే ల‌క్ష్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంద‌ని మంత్రులు ఆదిమూల‌పు సురేష్‌, గుడివాడ అమ‌ర్ నాథ్ తెలిపారు. బీచ్ ప‌రిశుభ్ర‌త కార్య‌క్ర‌మంలో భాగంగా శుక్ర‌వారం విశాఖ తీరంలోని కాళీమాత దేవాల‌యం ఎదురుగా ప‌రిస‌రాల‌ను మంత్రులు, న‌గ‌ర మేయ‌ర్ గొల‌గాని వెంక‌ట‌హ‌రికుమారి, జిల్లా క‌లెక్ట‌ర్‌, న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ ల‌తో పాటు వాలంటీర్లు క‌లిసి శుభ్రం చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడడం విశాఖ నగరాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను రీసైక్లింగ్ చేసి ఆదాయం పొందేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించిన‌ట్లు చెప్పారు. అందులో భాగంగానే అమెరికాకు చెందిన పార్లే సంస్థ‌తో ఒప్పందం కుదుర్చున‌ట్లు తెలిపారు. ప్లాస్టిక్ నిషేధించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చున‌న్నారు. పర్యావరణం బాగుంటేనే ప్రపంచం బాగుంటుందని, ప్లాస్టిక్ నిషేధించడం వల్ల ప్రజలకు సముద్ర జీవరాశులకు మేలు జరుగుతుందన్నారు. విశాఖ నగరాన్ని అద్భుతమైన నగరంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు.


సముద్ర తీరం ప్రాంతంలోని చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి స్వచ్ఛత నెలకొల్పే లక్ష్యంగా 'మెగా బీచ్ క్లీనింగ్' ప్రోగ్రాం చేపట్టారు. అమెరికాకు చెందిన 'పార్లే ఫర్‌ ది ఓషన్‌ 'సంస్థ ఈ కార్యక్రమం చేపట్టింది. ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకు సుమారు 28 కిలోమీటర్ల పొడవునా సాగరతీరంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల్ని సేక‌రించింది. ఈ కార్య‌క్ర‌మంలో సుమారు 21 వేల మంది వలంటీర్లు పాల్గొన్నారు. బీచ్ రోడ్ లో ప్లాస్టిక్ వ్యర్ధాల నివారణపై ఏర్పాటు చేసిన సైతిక శిల్పం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా నేవీ హెలికాఫ్ట‌ర్ ద్వారా చేప‌ట్టిన జాతీయ ప‌తాకాల ప్ర‌ద‌ర్శ‌న ప్ర‌త్యేక ఆకర్ష‌ణా నిలిచింది.



Next Story