తొలి స్వదేశీ విమాన వాహక నౌక విక్రాంత్ నావికా దళానికి అప్పగింత

India's first indigenous aircraft carrier Vikrant delivered to Navy.దేశ‌పు మొట్ట‌మొద‌టి స్వ‌దేశీ విమాన వాహ‌క నౌక

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 July 2022 10:52 AM IST
తొలి స్వదేశీ విమాన వాహక నౌక విక్రాంత్ నావికా దళానికి అప్పగింత

దేశ‌పు మొట్ట‌మొద‌టి స్వ‌దేశీ విమాన వాహ‌క నౌక విక్రాంత్ ను గురువారం నౌకాద‌ళానికి అప్ప‌గించారు. ప్ర‌భుత్వ రంగ షిప్‌యార్డ్ కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(సీఎస్ఎల్‌), నౌకాద‌శం మ‌ధ్య ఈ మేర‌కు ఒప్పందాలు జ‌రిగాయి. స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో ఈ నౌక‌ను త‌యారు చేశారు. ఇండియ‌న్ నేవీ అంత‌ర్గ‌త డైరెక్ట‌రేట్ ఆఫ్ నేవ‌ల్ (డీఎన్‌డీ) డిజైన్ రూపొందించ‌గా షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోని సీఎస్ఎల్ నిర్మించింది. ఈ ప్ర‌తిష్టాత్మ‌క నౌక డెలివ‌రీ తీసుకోవ‌డాన్ని నౌకాద‌శం చారిత్ర‌క ఘ‌ట‌న‌గా అభివ‌ర్ణించింది.

1971 యుద్ధంలో కీల‌క పాత్ర పోషించిన దేశ మొట్ట మొద‌టి ఎయిర్ క్రాప్ట్ క్యారియ‌ర్ ఐఎన్ఎస్ విక్రాంత్ పేరే దీనికి పెట్టారు. ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్ నేప‌థ్యంలో విక్రాంత్ మ‌ళ్లీ జీవం పోసుకోడం, తీర‌ప్రాంత భ‌ద్ర‌త‌ను సుస్థిరం చేయ‌డంలో దేశ చొర‌వ‌కు ఇది నిద‌ర్శ‌నంగా నౌకాద‌శం పేర్కొంది.


ఈ విమాన వాహక నౌక పొడవు 262 మీటర్లు. గతంలోని విక్రాంత్ కన్నా ఇది చాలా పెద్దది, అత్యాధునికమైనది. దీనికి నాలుగు గ్యాస్ టర్బయిన్స్ ఉన్నాయి. 88 మెగావాట్ల పవర్ తో ప‌నిచేస్తుంది. గరిష్ఠంగా 28 నాట్స్ వేగంతో (గంట‌కు 51.8కిలోమీట‌ర్లు) నడుస్తుంది. ఈ నిర్మాణ ప్రాజెక్టు మూడు దశల్లో జరిగిందని, మొదటి దశ 2007 మే నెలలో పూర్తయిందని, రెండో దశ డిసెంబరు 2014లోనూ, మూడో దశ 2019 అక్టోబరులోనూ పూర్తయిందని తెలిపింది. దీని కోసం దాదాపు రూ.20,000 కోట్లు ఖ‌ర్చు చేశారు. నౌక నిర్మాణం, సాంకేతిక‌త‌లో 76 శాతం స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో కూడిన‌దే కావ‌డం విశేషం.


'మేక్ ఇన్ ఇండియా' పథకానికి ఇది ఊదాహార‌ణ‌గా నిలుస్తోంద‌ని అధికారులు చెబుతున్నారు. ఈ నౌక‌లో మిగ్‌-29కె, క‌మోవ్‌-31 హెలికాఫ్ట‌ర్‌ల‌తో స‌హా 30 యుద్ధ విమానాల‌ను కూడా ఏక‌కాలంలో మోహ‌రించ‌వ‌చ్చు. స్వదేశీయంగా త‌యారు చేసిన అధునాత‌న లైట్ హెలికాఫ్ట‌ర్లు(ఏఎల్‌హెచ్‌), లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌(ఎల్‌సీఏ)ల‌ను కూడా నిర్వ‌హించ‌గ‌ల‌దు.

ఈ విమాన వాహక నౌక నిర్మాణంలో మన దేశంలోని బీఈఎల్, బీహెచ్ఈఎల్, జీఆర్ఎస్ఈ, కెల్ట్రాన్, కిర్లోస్కర్, లార్సన్ అండ్ టూబ్రో, వర్‌ట్సిల ఇండియా వంటి భారీ పరిశ్రమలతో పాటు దాదాపు 100కుపైగా ఎంఎస్ఎంఈ (చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలు) భాగస్వాములయ్యాయి. ఆగ‌స్టు 2021, జూలై 2022ల మ‌ధ్య ఈ విమాన వాహ‌క నౌక‌కు విస్త్రృత‌మైన ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించారు. అందులో సంతృప్తిక‌ర ఫ‌లితాలు వ‌చ్చాయి. దీన్ని త్వ‌ర‌లోనే నౌకాద‌ళంలోకి ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. హిందూ మ‌హాస‌ముద్ర ప్రాంతంలో ఇది భార‌త్ స్థానాన్ని బ‌లోపేతం చేయ‌నుంది.

Next Story