విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆయన్ను ఏ క్షణాన అయిన అరెస్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుండడంతో నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు అయ్యన్న ఇంటికి తరలివస్తున్నారు. తమ నాయకుడిని అరెస్టు చేస్తే ఊరుకునేది లేదని, టీడీపీ నాయకులపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేదిస్తోందని వారు మండిపడుతున్నారు.
ఈ నెల 18న పశ్చిమగోదావరి జిల్లా నల్లజరల్లో జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన సీఎంను దూషించారంటూ స్థానిక వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన నల్లజర్ల పోలీసులు బుధవారం అయ్యన్న ఇంటికి వచ్చారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు. కాగా.. నిన్నటి నుంచి పోలీసులు అయ్యన్న నివాసం వద్దే ఉండడంతో అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఆందోళన సర్వత్రా నెలకొంది.