పల్లా శ్రీనివాస్ భవనం కూల్చివేతపై టీడీపీ ఆగ్రహం

Demolished MLA Palla Srinivasa Rao's building. జీవీఎంసీ అధికారులు గ‌త రాత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‎ కు చెందిన బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాన్ని కూల్చివేశారు.

By Medi Samrat  Published on  25 April 2021 4:12 PM IST
Palla Srinivas

జీవీఎంసీ అధికారులు గ‌త రాత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‎ కు చెందిన బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాన్ని కూల్చివేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణం జరిపారని జీవీఎంసీ అధికారులు చెబుతూ ఉన్నారు. నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని ఎలా కూల్చుతార‌ని జీవీఎంసీ సిబ్బందిని ప‌ల్లా ప్రశ్నించారు. ఈ ఘ‌ట‌న‌పై ప‌ల్లా మీడియాతో మాట్లాడారు. త‌న భ‌వ‌నాన్ని కూల్చడానికి కారణం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డేన‌ని చెప్పారు. ఆ పార్టీలో చేరాల‌ని విజయసాయి రెడ్డి త‌న‌ను ఆహ్వానించారని, తాను వైసీపీలోకి చేరనందుకే త‌న‌ భవనాన్ని కూల్చివేశారని ఆరోపించారు. త‌న‌పై కక్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్పడ్డారని.. త‌న‌ భవనాన్ని కూల్చి విజయసాయిరెడ్డి రాక్ష‌సానందం పొందుతున్నార‌ని ఆరోపించారు. రోడ్డుకు సెట్ బ్యాక్ వదలలేదని, అందుకే కూల్చివేశామని అధికారులు తెలిపారు.

విశాఖలో టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ భవనాన్ని జీవీఎంసీ అధికారులు కూల్చడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ కూల్చివేతలపై టీడీపీ నేత‌ నారా లోకేశ్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అది కూడా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. 'ప్రజల ప్రాణాలు గాలికొదిలి ప్రతిపక్ష నేతల భవనాలు కూల్చే పనిలో బిజీగా ఉన్నారు జగన్ రెడ్డి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించి, కార్మికుల పక్షాన నిలిచినందుకే టీడీపీ నేత ప‌ల్లా శ్రీ‌నివాస్ గారిపై కక్షపూరిత చర్యలకు దిగారు' అని నారా లోకేష్ ఆరోపించారు.

'విశాఖ ఉక్కుని తుక్కు రేటుకి కొట్టేయాలని ప్లాన్ చేసిన జగన్ రెడ్డికి అడ్డొచ్చారు అనే అక్కసుతోనే ఆదివారం పూట పల్లా గారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. అందుకే ఈ వైకాపా ప్రభుత్వాన్ని జేసీబీ ప్రభుత్వం అన్నది' అని నారా లోకేశ్ విమ‌ర్శించారు.

'కనీసం నోటీసు ఇవ్వకుండా, చట్టాన్ని తుంగలో తొక్కి యుద్ధ వాతావరణంలో భవనాన్ని కూల్చివేయడాన్ని, కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. నీ జేసీబీ ఊపులకు భయపడే వాడు ఎవడూ లేడు జగన్ రెడ్డి' అని నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

వైసీపీ ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలి, పనిదినాల్లో అక్రమాలు, సెలవుదినాల్లో విధ్వంసాలకు పాల్పడుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇంట్లో మనుషులు లేని సమయం చూసి దొంగలు పడ్డట్టు కోర్టు సెలవు రోజుల్లోనే జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష్య పూరితంగా టీడీపీ నేతల ఇల్లు, భవనాలు కూల్చివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్వేషం, విధ్వంసం లేకుండా వైసీపీకి ఉనికి లేదన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేసిన పల్లా శ్రీనివాస్‌పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం దుర్మార్గమన్నారు.


Next Story