రైల్వే జోన్ పనులకు గ్రీన్ సిగ్నల్
Green Signal to Railway Zone Works.రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వే జోన్ పట్టాలెక్కుతోంది. విశాఖ కేంద్రంగా సౌత్
By సునీల్ Published on 10 Aug 2022 12:05 PM ISTరాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వే జోన్ పట్టాలెక్కుతోంది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు 2019లొనే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
విశాఖ రైల్వే జోన్‌ను కేంద్రం 2019 ఫిబ్రవరి 27న ప్రకటించింది. వాల్తేరు డివిజన్‌ను రద్దు చేసింది. అందులో కొంత భాగంతో ఒడిశాలోని రాయగడ కేంద్రంగా ఒక డివిజన్ ఏర్పాటు చేసింది. మిగిలిన భాగాన్ని, అంటే విశాఖ నగరంతో పాటు విజయవాడ డివిజన్‌లో కలిపింది. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో విశాఖ జోన్ ఉంటుందని కేంద్రం ప్రకటించింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు తీర రైల్వేలో ఉండడంతో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తెలుగు ప్రాంతాల నుంచి విశాఖకు రైళ్లు నడపడం, సీట్ల విషయంలో ప్రాధాన్యం లేదనీ ఆరోపణలుండేవి. అందుకే ప్రత్యేక జోన్ డిమాండ్ వచ్చింది.
తూర్పు కోస్తా రైల్వేకి ఏటా రూ.15 వేల కోట్ల ఆదాయం వస్తోంది. అందులో సగానికి సగం వాల్తేరు(విశాఖ) రైల్వే డివిజన్ నుంచే వస్తుంది. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకి రూ.25 లక్షలు వస్తుంది. తూర్పు కోస్తా ప్రధాన కేంద్రమైన భువనేశ్వర్‌లో రోజుకి రూ.12 లక్షల రూపాయలే వస్తుంది. వాల్తేరు డివిజన్‌కి ప్రధాన ఆదాయం కేకే లైన్‌లో జరిగే ఐరన్ ఓర్ రవాణా ద్వారానే వస్తుంది. అయితే ఇప్పుడు ఇదంతా రాయగడ డివిజన్‌కి వెళ్లిపోతుందని రైల్వే కార్మిక సంఘాలు ఆందోళనలు చేశాయి.
ఇదిలా ఉంటే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుపై ఎట్టకేలకు కేంద్రంలో కదలిక వచ్చింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల పార్లమెంటులో మాట్లాడారు. రైల్వే జోన్ భవన నిర్మాణానికి స్థల సేకరణ పూర్తయ్యిందని తెలిపారు. జోన్ ఏర్పాటుకు నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని అన్నారు. రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌ను ఆమోదించినట్లు మంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా రాష్ట్ర పునర్విభజన చట్టంలో ప్రకటించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుకు డిమాండ్లు
విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. దేశంలో మొత్తం 21 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేదు. దీంతో ఉద్యోగార్ధులు రైల్వే పరీక్షల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. కనుక జోన్ తోపాటు బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.