విశాఖ: లేఖ రాసి న‌లుగురు ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థినుల అదృశ్యం.. ఆత‌రువాత‌..?

Four school girls missing in Vizag.న‌లుగురు ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థినులు పాఠ‌శాల నుంచి అదృశ్య‌మైన ఘ‌ట‌న విశాఖ న‌గ‌రంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Nov 2022 9:19 AM IST
విశాఖ: లేఖ రాసి న‌లుగురు ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థినుల అదృశ్యం.. ఆత‌రువాత‌..?

"మాకోసం వెతక్కండీ..మేము మా కాళ్లమీద బతకాలి అనే దూరంగా వెళ్లిపోతున్నాం..అంతేతప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనికాదు..మా బతుకు కోసం వెళ్తున్నాం..అలా అని మేము అబ్బాయిలతో వెళ్తున్నాము అని మీరు అనేసుకోవద్దు. మేము పైకి ఎదగటానికి మాత్రమే వెళ్తున్నాం..మాకోసం వెతకొద్దు. మేము ఎక్కడున్నా మీకోసమే ఆలోచిస్తాం. మేము మంచి 'పొజిషన్' కు వచ్చాక మేమే మీ దగ్గరకొస్తాం.."అంటూ లేఖ రాసిన న‌లుగురు ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థినులు పాఠ‌శాల నుంచి అదృశ్య‌మైన ఘ‌ట‌న విశాఖ న‌గ‌రంలో చోటుచేసుకుంది. స్పందించిన పోలీసులు బాలిక‌ల‌ను 12 గంట‌ల్లోపే వెతికి ప‌ట్టుకున్నారు.

వివ‌రాలు ఇలా ఉన్నాయి. విశాఖ‌న‌గ‌రంలోని ఒక‌టో ప‌ట్ట‌ణ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఓ ప్ర‌భుత్వ బాలిక‌ల పాఠ‌శాల‌లో ప‌దోత‌ర‌గ‌తి చ‌దువుతున్న న‌లుగురు విద్యార్థినులు బుధ‌వారం పాఠ‌శాల వ‌దిలిన అనంత‌రం ట్యూష‌న్‌కు వెళ్లాల్సి ఉంది. రాత్రి అయిన‌ప్ప‌టికి విద్యార్థినులు ఇంటికి రాక‌పోవ‌డంతో ఆందోళ‌న చెందిన విద్యార్థినుల త‌ల్లిదండ్రులు చుట్టు ప‌క్క‌ల అంతా గాలించారు. ఓ బాలిక ఇంట్లో ఓ లేఖ దొరికింది. అందులో తాము ఉన్న‌త‌స్థాయికి చేరుకున్నాకే తిరిగి వ‌స్తాం అని ఉంది. మ‌రింత ఆందోళ‌న చెందిన వారు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

వెంట‌నే స్పందించిన పోలీసులు బాలిక‌ల కోసం గాలింపు చేప‌ట్టారు. చివ‌రికు గాజువాక‌లో ఉన్న‌ట్లు తెలుసుకుని గురువారం మ‌ధ్యాహ్నం వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించారు.

పాఠ‌శాల వ‌దిలిన అనంత‌రం బాలిక‌లు సాగ‌ర తీరం, ఆర్టీసీ కాంప్లెక్సు, రైల్వేస్టేష‌న్ ఇలా ప‌లు ప్ర‌దేశాలు తిరిగారు.

Next Story