విశాఖలోని ఇండస్‌ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  14 Dec 2023 1:35 PM IST
fire accident,  vizag,  hospital,

 విశాఖలోని ఇండస్‌ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జగదాంబ జంక్షన్‌ వద్ద ఉన్న ఇండస్‌ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో.. భయబ్రాంతులకు గురైన రోగులు, ఆస్పత్రి సిబ్బంది అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే.. కొద్దిసేపట్లోనే మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగతో ఆస్పత్రి మొత్తం నిండిపోయింది. అప్రమత్తమైన పలువురు వెంటనే బయటకు రాగా.. కొందరు అందులోనే చిక్కుకుపోయారు.

అగ్నిప్రమాదం గురించి ఆస్పత్రి యాజమాన్యం వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఆస్పత్రికి వద్దకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను క్షేమంగా బయటకు తీసుకొస్తున్నారు. ఆస్పత్రి భవనంలో పెద్ద ఎత్తున పొగ రావడం.. చుట్టుపక్కల కూడా వ్యాపించింది. దాంతో.. స్థానికంగా ఉన్నవారు భయాందోళకు గురయ్యారు. ఈ సంఘటనలో గాయపడ్డవారితో పాటు.. ఇతర రోగులను వేర్వేరు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అగ్నిప్రమాద సంఘటనలో ఇండస్‌ ఆస్పత్రి సమీపంలో ఉన్న ఇతర దుకాణాలను అధికారులు మూసివేయించారు.

అగ్నిప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీస్‌ కమిషనర్ రవిశంకర్‌ అక్కడికి వెళ్లారు. సహాయక చర్యలతో పాటు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. అయితే.. ఆపరేషన్‌ థియేటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. ఆ తర్వాత కొద్ది క్షణాల్లో పెద్ద ఎత్తున వ్యాపించాయని అధికారులు గుర్తించారు. ఇక మంటలు ఎలా చెలరేగాయి..ప్రమాదానికి గల కారణమేంటనేది తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారనీ.. దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీస్‌ కమిషనర్ రవిశంకర్ తెలిపారు.

Next Story