మందుబాబుల తిక్క కుదిరింది.. వైజాగ్ బీచ్ క్లీన్ అయ్యింది

Drunk-driving offenders asked to clean up Visakhapatnam beach.మ‌ద్యం తాగి వాహ‌నాలు న‌డ‌ప‌డం నేరం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Feb 2023 3:18 AM GMT
మందుబాబుల తిక్క కుదిరింది.. వైజాగ్ బీచ్ క్లీన్ అయ్యింది

మ‌ద్యం తాగి వాహ‌నాలు న‌డ‌ప‌డం నేరం. తాగి వాహనంతో రోడెక్క‌డం అంటే కోరి ప్ర‌మాదాలు కొని తెచ్చుకోవ‌డ‌మే. అది వారి ప్రాణాలకే కాదు ఎదుటి వారి ప్రాణాలకు కూడా రిస్కే. తాగి వాహ‌నం డ్రైవింగ్ చేస్తే కొన్ని సంద‌ర్భాల్లో ఏ త‌ప్పు చేయ‌ని అమాయ‌కులు కూడా బ‌లైపోతున్నారు. పోలీసులు ప‌ట్టుకుని ఫైన్లు విధిస్తున్నా, అరెస్ట్ చేస్తున్నా.. వాహ‌నాల‌ను సీజ్ చేస్తున్నా, కోర్టులు శిక్ష‌లు విధిస్తున్న‌ప్ప‌టికి మందుబాబులు మార‌డం లేదు.

మందు బాబుల్లో మార్పు తీసుకువ‌చ్చేందుకు విశాఖ మెట్రోపాలిట‌న్ మెజిస్ట్రేట్ కోర్టు వినూత్న శిక్ష విధించింది. ఇది మందుబాబుల్లో మార్పు తీసుకువ‌స్తుంద‌ని ఆశిస్తోంది. అంతేకాకుండా ఈ శిక్ష వ‌ల్ల స‌మాజానికి కాస్త అయిన మేలు జ‌రుగుతుంది.

విశాఖ‌లో నిర్వ‌హించిన డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీల్లో మూడు రోజుల్లో 52 మంది మందుబాబులు ప‌ట్టుబ‌డ్డారు. పోలీసులు వీరిని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజ‌రుప‌రిచారు. న్యాయమూర్తి వీరికి విభిన్నమైన శిక్ష విధించారు. కేవ‌లం శిక్ష విధిస్తే స‌రిపోద‌ని బావించిన న్యాయ‌స్థానంలో వారిలో ప‌రివ‌ర్త‌న తెచ్చేందుకు పూనుకుంది. బీచ్‌లో వ్య‌ర్థాల‌ను ఏరివేయాల‌ని, బీచ్‌ను శుభ్రం చేయాల‌ని ఆదేశించింది.

న్యాయ‌స్థానం ఆదేశాల మేర‌కు 52 మంది మందుబాబుల‌ను పోలీసులు వైజాగ్ బీచ్‌కు తీసుకువెళ్లారు. బీచ్‌లో ప‌డి ఉన్న క‌వ‌ర్లు, బాటిళ్లు, అనేక వ్య‌ర్థాల‌ను వారితో తీయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బీచ్ లోని చెత్తను ఎత్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మందుబాబుల తిక్క కుదిరింది అంటూ నెటీజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. మ‌రీ వీరిలో ఇప్ప‌టికైనా మార్పు వ‌స్తుందని ఆకాంక్షించారు.

Next Story