ఢిల్లీలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సన్నాహక సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర రాజధానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖ కాబోతుందన్నారు. కొన్ని నెలల్లో తాను కూడా విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు చెప్పారు.
మార్చి 3, 4 తేదీల్లో విశాఖ పట్నంలో ఇన్వెస్టర్ల సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో సన్నాహాక సదస్సు జరగుతోంది. అందులో పాల్గొన్న ఇన్వెస్టర్లును ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను ఆయన ఇన్వెస్టర్లుకు తెలియజేశారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మా వంతు సహకారం అందిస్తామన్నారు. ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్‌ని నిలబెట్టడానికి మీ సహకారం మాకు అవసరం అని తెలిపారు. ఈ విషయంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబుతున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ గత మూడేళ్లుగా నెంబర్ వన్‌గా ఉంటోందన్నారు. రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. 11.43 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే వేగంగా వృద్ధి చెందుతోంది. దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 11 ఇండస్ట్రీయల్ కారిడార్‌లో రాష్ట్రానికి మూడు రావడం శుభపరిణామం అని అన్నారు.
రాబోవు రోజుల్లో విశాఖ పాలనా రాజధానిగా మారబోతుందని, తాను కూడా అక్కడి నుంచే పాలన కొనసాగిస్తానని చెప్పారు. విశాఖలో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.