విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు ఆమోదం
Centre Green Signal To Visakhapatnam Railway Zone.విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు ప్రతిపాదనకు
By తోట వంశీ కుమార్ Published on 26 March 2022 9:53 AM ISTవిశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజ్యసభలో శుక్రవారం భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎంపీ జీవీఎల్ నరసింహారావు విశాఖ రైల్వే జోన్ అంశంపై స్పష్టత ఇవ్వాలని అడిగిన ప్రశ్నపై రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు, వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిందని రైల్వేశాఖ మంత్రి చెప్పారు.
రైల్వే జోన్ ఏర్పాటుపై చేపట్టిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సమర్పించిన అనంతరం దక్షిణ కోస్తా రైల్వేజోన్, రాయగఢ రైల్వే డివిజన్ పరిధులు, ఇతర అంశాలపై కొన్ని సలహాలు సూచనలు వచ్చాయని, వీటిపై మరింత లోతుగా విశ్లేషించేందుకు సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్త రైల్వేజోన్, రైల్వే డివిజన్ కోసం ఇప్పటికే 2020-21 కేంద్ర బడ్జెట్ లో రూ.170 కోట్ల నిధులు కేటాయించినట్లు గుర్తు చేశారు.
దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి ఇప్పటికే భూమిని ఎంపిక చేసినట్లు తెలిపారు. మొత్తం ప్రక్రియను వేగవంతం చేయడానికి వీలుగా భూ సర్వే, ప్రధాన కార్యాలయ సముదాయం లే అవుట్, రెసిడెన్షియల్ కాలనీ, ఇతర నిర్మాణ పనుల ప్రాథమిక కార్యకలాపాలను చేపట్టాలని రైల్వేశాఖ ప్రత్యేకాధికారికి నిర్దేశించినట్లు తెలిపారు. కర్నూలు కోచ్ మిడ్‌లైఫ్ రిహాబిలిటేషన్ వర్క్‌షాప్ కేటాయింపులను తాజాగా రూ. 560.72 కోట్లకు పెంచినట్టు వివరించారు.