వారిద్దరి పెళ్లికి ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేశారు. బంధువులతో కళ్యాణ మండపం నిండిపోయింది. మేళతాళాలు మోగుతున్నాయి. వధూ వరులు పెళ్లిపీటలపై కూర్చుకున్నారు. మరికొద్ది క్షణాల్లో వారిద్దరూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. పెళ్లి తంతులో భాగంగా వరుడు.. వధువు నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో పెళ్లి కుమారై కుప్పకూలింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వధువు మృతి చెందింది. దీంతో ఒక్కసారిగా పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషాదకర ఘటన విశాఖపట్నంలోని మధురవాడలో చోటు చేసుకుంది.
మధురవాడ నగరం పాలెంలో నిన్న(బుధవారం) రాత్రి 7 గంటలకు నాగోతి శివాజీ, సృజనల వివాహాం జరగాల్సి ఉండగా.. సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అనంతరం పెళ్లి తంతును ప్రారంభించారు. వరుడు.. వధువు తలపైన జీలకర్ర బెల్లం పెడుతుండగా ఆమె సృహ కోల్పోయింది. ఆమె పీటలపైనుంచి కింద పడిపోవడంతో అప్రమత్తమైన కుటుంబీకులు, బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఊహించని ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. వివాహ నేపథ్యంలో గత రెండు రోజులుగా పెళ్లి కూతురు అలసటకు గురై నీరసించిందని బంధువులు తెలిపారు. కానీ ఇలా ప్రాణాలు కోల్పోతుందని భావించి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.