రుషికొండ తవ్వకాల విచారణ అంశంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

AP High Court Key Comments on Rushikonda Digging. విశాఖపట్నంలోని రుషికొండ తవ్వకాల అంశంపై టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు

By M.S.R  Published on  21 Dec 2022 11:20 AM GMT
రుషికొండ తవ్వకాల విచారణ అంశంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

విశాఖపట్నంలోని రుషికొండ తవ్వకాల అంశంపై టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు, జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌లపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. అక్రమ తవ్వకాలపై నిగ్గు తేల్చేందుకు హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం వేసిన కమిటీలో ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నియమించడంపై పిటిషనర్ల తరపు న్యాయవాదులు గత విచారణ సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నియామకాలు కోర్టు ఆదేశాలకు విరుద్దంగా ఉన్నాయన్నారు. ఈ క్రమంలోనే అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. దీంతో ఏపీ ప్రభుత్వ అధికారులు నియామకాన్ని సమర్ధిస్తూ కేంద్రం ఆఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంతో కేంద్రం చేతులు కలిపినట్టుగా కనిపిస్తోందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

పిటిషనర్ల అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలోనే పిటిషన్‌పై విచారణ జరిపి తామే కమిటీని నియమిస్తామని హైకోర్టు పేర్కొంది. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులను హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. రుషికొండ ప్రాంతాన్ని వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే..! ఈ సమయంలో హైకోర్టు విచారణలో ఏమి తేలుతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Next Story