Visakhapatnam: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి
విశాఖపట్నంలో బుధవారం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.
By అంజి Published on 6 April 2023 5:52 AM GMTVisakhapatnam: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి
విశాఖపట్నంలో బుధవారం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం- సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై గత మూడు నెలల్లో రాళ్లదాడి ఘటన జరగడం ఇది మూడోసారి. ''బుధవారం విశాఖపట్నం నుండి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 05:45 గంటలకు బయలుదేరే బదులు 09:45 గంటలకు తిరిగి షెడ్యూల్ చేయబడింది. ఎందుకంటే దుండగులు రాళ్లదాడి చేయడం వల్ల C-8 కోచ్ కిటికీ అద్దాలు పగిలిపోయాయి'' అని వాల్తేయిర్ డివిజన్ రైల్వే అధికారిక ప్రకటనలో పేర్కొంది.
అంతకుముందు జనవరిలో, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరంలో వందేభారత్ రైలు నిర్వహణ సమయంలో రాళ్ల దాడి జరిగింది. విశాఖపట్నంలోని కంచరపాలెం సమీపంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్ అద్దాలు దెబ్బతిన్నాయి. డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) అనుప్ కుమార్ సేతుపతి ప్రకారం.. ''వందే భారత్ రైలు నిర్వహణ, రైలు రన్ కోసం విశాఖపట్నం చేరుకున్నప్పుడు కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. విశాఖపట్నం స్టేషన్ నుంచి మెయింటెనెన్స్ కోసం కోచ్ కేర్ సెంటర్‌కు వెళ్తుండగా రైలు కోచ్‌లపై రాళ్ల దాడి జరిగింది. మేం సిసిటివి ఫుటేజీని ధృవీకరిస్తున్నామని, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) నిందితుల కోసం వెతుకుతున్నారు'' అని అన్నారు.
''ఇది చాలా దురదృష్టకర సంఘటన. కంచరపాలెం సమీపంలో కోచ్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేయడంతో సరికొత్త వందేభారత్ రైలు కోచ్ అద్దాలు పగిలిపోయాయి. సీసీటీవీ కెమెరాలను వెరిఫై చేస్తున్నాం. మా ఆర్పీఎఫ్ పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు. వారు పట్టుకున్న తర్వాత శిక్షిస్తారు. రైల్వే ప్రజాధనానికి చెందినది. ఇలాంటి పనులు చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కిటికీ గ్లాసు ధర సుమారు లక్ష ఉంటుందని అంచనా వేయబడింది'' అని డివిజన్ రైల్వే మేనేజర్ తెలిపారు.