అనుమతి లేకుండా పొలిటికల్‌ మీటింగ్స్ పెట్టొద్దు: విశాఖ సీపీ

కొందరు అనుమతి లేకుండా రాజకీయ సమావేశాలు పెడుతున్నారని అలా చేస్తే చర్యలు తీసుకుంటామని విశాఖ సీపీ రవిశంకర్‌ చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  21 March 2024 2:27 PM IST
andhra pradesh, political meetings, elections, vizag police,

 అనుమతి లేకుండా పొలిటికల్‌ మీటింగ్స్ పెట్టొద్దు: విశాఖ సీపీ

దేశంలో లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతోంది. ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. షెడ్యూల్‌ విడుదలతో దేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో ఏపీలో రాజకీయ ప్రచార సభలపై విశాఖ పోలీస్ కమిషనర్ కీలక సూచనలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అందరూ నిబంధనలు పాటించాలని చెప్పారు. కొందరు అనుమతి లేకుండా రాజకీయ సమావేశాలు పెడుతున్నారని అలా చేస్తే చర్యలు తీసుకుంటామని విశాఖ సీపీ రవిశంకర్‌ మీడియాతో చెప్పారు.

రాజకీయ పార్టీలు అన్నీ ఎన్నికల ప్రచారం కోసం సువిధ యాప్ ద్వారా పర్మిషన్ తీసుకోవాలని విశాఖ సీపీ రవి శంకర్ అన్నారు. ఇందుకోసం యాప్‌ పనిచేస్తుందని అన్నారు. ఒక వేళ యాప్‌ ద్వారా అనుమతి తీసుకోలేకపోతే.. యాప్ పనిచేయకపోతే రిటర్నింగ్ అధికారి వద్ద అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఎన్‌వోసీ మాత్రం పోలీసులే ఇస్తారని సీపీ రవి శంకర్ చెప్పారు. ర్యాలీలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారానికి పోలీసులు అనుమతి ఇవ్వరనీ.. రిటర్నింగ్ అధికారే చూసుకుంటారని సీపీ రవి శంకర్ తెలిపారు.

అయితే.. కొందరు పొలిటికల్‌ సమావేశాలను అనుమతి లేకుండానే నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు విశాఖ. ఇలాంటి వారిపై చర్యలు తప్పకుండా తీసుకుంటామన్నారు. ఎస్‌ఎస్‌టీ టీమ్‌ ఇప్పటికే ఐదు విభాగాలుగా పనిచేస్తోందని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందే అని సీపీ రవి శంకర్ స్ట్రాంగ్‌గా చెప్పారు. జిల్లాలో మొత్తం 728 మంది వద్ద లైసెన్స్‌ తుపాకులు ఉన్నాయనీ.. వాటిని హ్యాండ్ ఓవర్‌ చేసుకున్నామని సీపీ రవి శంకర్‌ చెప్పారు. మరోవైపు ఎవరైనా ఫేక్‌ ఫిర్యాదు ఇచ్చినా సీరియస్‌గా పరిణగణించి చర్యలు తీసుకుంటామని విశాఖ సీపీ రవి శంకర్ చెప్పారు.

Next Story