కరోనాకు ఈగో ఎక్కువ.. పిలిస్తే గానీ రాదు
By తోట వంశీ కుమార్ Published on 26 March 2020 6:33 PM ISTకరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. తాజాగా దీనిపై భారత మాజీ క్రికెటర్, డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించాడు.
కరోనా వైరస్‌కు ఈగో ఎక్కువ అని, తనంతట తాను ఇంటిలోకి ప్రవేశించబోదని ఈ సందర్భంగా చమత్కరించాడు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని, అత్యవసర పరిస్థితిలో మినహా మిగతా సమయమంతా ఇంటిలోనే ఉండాలని సూచించాడు. తద్వారా వైరస్ ఆహ్వానించే అవకాశం ఇవ్వకూడదని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. చరిత్రలో తొలిసారి ఓ వైరస్ కారణంగా వర్క్ ఫ్రం హోం(ఇంటి నుంచి పని) ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని వారు చేస్తున్నారన్నాడు. 20 రోజులపాటు ఇంట్లో గడపాలని, ఎవరి జీతాలు వాళ్లకు వస్తాయని సూచించాడు. 15 నుంచి 20 రోజుల పాటు ఓపిక పడితే, వైరస్‌ను దేశం నుంచి తరిమి కొట్టే అవకాశం ఉందన్నాడు.
కరోనా వైరస్ ముప్పుతో ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు వాయిదా పడగా.. మరికొన్నింటిని పూర్తిగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేశారు. అలాగే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడలను కూడా వచ్చే ఏడాదికి వాయిదా వేశారు