ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళాకు లక్షలాది మంది వెళుతున్నారు. దీంతో ప్రయాణికులతో రైళ్లు కిక్కిరిసి పోతున్నాయి. ఇటీవల ఓ యువతి, ఆమె స్నేహితులు రైలు టాయిలెట్‌లోకి దూరి కుంభమేళకు ప్రయాణం చేశారు. వారి ప్రయాణానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఆ వీడియో క్లిప్‌లో.. ఆ మహిళ టాయిలెట్ సీటు పైన నిలబడి ఉన్నట్లు చిత్రీకరించుకుంది. ఇరుకైన ప్రదేశంలో ఆమె పక్కన తన ఇద్దరు స్నేహితులు ఉన్నారు.
"అబ్బాయిలు.. మేము రైలు టాయిలెట్‌లో ఉన్నాము. కుంభమేళాకు వెళ్తున్నాము" అని ఆమె ప్రకటిస్తూ, వారి పరిస్థితిని చూపించడానికి కెమెరాను చుట్టూ తిప్పింది. ఒక సమయంలో, ఆమె ఒక స్నేహితురాలిని తలుపు తెరవవద్దని హెచ్చరిస్తుంది. బయట వేచి ఉన్న వారి గురించి చమత్కరిస్తుంది. అయితే వారి ఈ ప్రయాణ ఏర్పాటు వారికి వినోదభరితంగా అనిపించినప్పటికీ, నెటిజన్లకు అలా అనిపించలేదు. ఇప్పటివరకు 8,35,000 కంటే ఎక్కువ వీక్షణలను పొందిన ఈ వీడియో ఆగ్రహాన్ని రేకెత్తించింది, అనేక మంది వినియోగదారులు వారి పౌర జ్ఞానం లేకపోవడాన్ని ప్రశ్నించారు. ప్రయాణికుల కాలకృత్యాల కోసం ఉద్దేశించబడిన ప్రదేశాన్ని ఇలా మూసివేసి వీడియోలు చేసుకున్న వారిపై నెటిజన్లు ఫైర్ అయ్యారు.