నిందితుడిని అరెస్ట్‌ చేసేందుకు ఆస్పత్రికి దూసుకెళ్లిన పోలీస్ జీపు

పోలీసులు నిందితులను పట్టుకునేందుకు కొన్నిసార్లు చేజింగ్‌లు చేస్తుంటారు.

By Srikanth Gundamalla  Published on  23 May 2024 10:09 AM GMT
viral video, police jeep,  hospital, Uttarakhand,

 నిందితుడిని అరెస్ట్‌ చేసేందుకు ఆస్పత్రికి దూసుకెళ్లిన పోలీస్ జీపు 

పోలీసులు నిందితులను పట్టుకునేందుకు కొన్నిసార్లు చేజింగ్‌లు చేస్తుంటారు. పారిపోతున్న దొంగలు.. లేదంటే ఏవైనా నేరాలు చేసిన నిందితులను పట్టుకోవడానికి పరుగెత్తడం.. లేదంటే కారులో చేజ్‌ చేయడం వంటివి జరుగుతాయి. అయితే.. తాజాగా ఓ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ఏకంగా ఆస్పత్రిలోకి తమ జీపుని తీసుకెళ్లారు. అక్కడ స్ట్రెచర్లపై ఉన్న వారిని పక్కకు జరుపుతూ ఆస్పత్రిలోనే డ్రైవింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. రిషికేశ్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో సినీఫక్కీలో ఈ దృశ్యాలు కనిపించాయి. ఆస్పత్రిలోకి పోలీసులు కొందరు ఎంట్రీ ఇచ్చారు. తమ వాహనాన్ని ఆస్పత్రి బిల్డింగ్ బయట ఆపకుండా ఏకంగా లోనికి తీసుకొచ్చారు. అంతేకాదు.. అక్కడున్న వారిని పక్కకి జరుపుతూ.. మెల్లిగా అయినా సరే.. ఇతరులు ఇబ్బందులు పడుతున్నది కూడా చూడకుండా ఆస్పత్రిలో డ్రైవ్ చేశారు. స్ట్రెచర్‌లపై ఉన్నవారిని పక్కకు జరుపుతూ పోలీసులు జీప్‌ని ముందుకు తీసుకెళ్లడం వీడియోలో కనిపిస్తుంది.

అయితే.. మే 19వ తేదీన ఓ మహిళా డాక్టర్‌ను.. నర్సింగ్‌ ఆఫీసర్ వేధించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే బాధితురాలి ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు ఆ నిందితుడిని పట్టుకునేందుకు ఆస్పత్రికి వెళ్లారు. నిందితుడు సతీశ్‌ కుమార్‌ రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిగా తెలిసింది. ఏకంగా ఆస్పత్రి థియేటర్లోనే వేధించినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఇక ఆమె ఫిర్యాదు తర్వాత అతన్ని సస్పెండ్ చేసింది ఆస్పత్రి యాజమాన్యం. లైంగిక వేధింపుల ఆరోపణల కింద సతీశ్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

ఇక పోలీసు వాహనం ఆస్పత్రిలోకి దూసుకెళ్లడంపై డెహ్రాడూన్‌ ఎస్‌ఎస్పీ స్పందించారు. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. అలాగే పోలీసు వాహనం ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకెళ్లిందని చెబుతున్నారనీ.. కానీ అది వెయిటింగ్ గ్యాలరీ అని డెహ్రాడూన్ ఎస్‌ఎస్పీ వెల్లడించారు.

Next Story