అమ్మాయిలూ రోడ్డుపై ఈ పనులేంటి..? రూ.33వేలు ఫైన్ వేసిన పోలీసులు

సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం యువత ఏది పడితే అది చేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  26 March 2024 5:15 AM GMT
uttar pradesh, two girls, viral video, police fine,

 అమ్మాయిలూ రోడ్డుపై ఈ పనులేంటి..? రూ.33వేలు ఫైన్ వేసిన పోలీసులు

సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం యువత ఏది పడితే అది చేస్తున్నారు. కొందరైతే ఏకంగా తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు ఉన్నాయి. అయితే.. సోషల్‌ మీడియాలో లైక్స్‌.. ఫాలోవర్స్‌ కోసం కొంతమంది యువత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ మెట్రో రైలులో ఇద్దరు యువతులు హోలీ రంగులు పూసుకుంటూ అసభ్యంగా ప్రవర్తించారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక ఇదే తరహాలో ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా ఓ సంఘటన జరిగింది.

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని నోయిడాలో బైక్‌పై వెళ్తూ ఇద్దరు యువతులు అసభ్యకరంగా ప్రవర్తించారు. రీల్స్‌ చేసి.. లైక్స్‌ సొంతం చేసుకోవాలనీ, ఫేమస్‌ అవ్వడం కోసం విచ్చలవిడిగా ప్రవర్తించారు. అయితే.. హోలీ సందర్భంగా రోడ్లపైకి వచ్చిన ఇద్దరు యువతులు ఈ పని చేశారు. ముందు స్కూటర్‌ ఓ యువకుడు నడుపుతుండగా.. వెనకాలే ఇద్దరు యువతులు కూర్చున్నారు. వారిద్దరు ఎదురెదురుగా కూర్చుని కదులుతున్న బైక్‌పై రంగులు పూసుకున్నారు. అంతటితో ఆగలేదు.. అసభ్యకరరీతిలో హావభావాల్లో మునిగిపోయారు. ఈ వీడియోను రికార్డు చేసి దానికి ఒక హిందీ పాటను కలిపి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. ప్రస్తుతం ఇదే వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లైక్‌లు.. ఫేమస్‌ అవ్వడం కోసం ఇంత నీచంగా ప్రవర్తించాలా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇక ఈ వీడియోను నోయిడా పోలీసులకు ట్యాగ్‌ చేస్తూ చర్యలు తీసుకోవాలంటూ పలువురు కామెంట్స్ పెట్టారు. ఇక దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు సీరియస్‌ అయ్యారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించారనీ.. వారికి ఈ-చలాన్ విధించారు. ఈ విషయాన్ని ఎక్స్‌ వేదికగా తెలిపారు నోయిడా పోలీసులు. ముగ్గురికి కలిపి రూ.33వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. పోలీసులు వారికి ఫైన్ విధించి సరైన బుద్ధి చెప్పారంటూ నెటిజన్లు సమర్ధిస్తున్నారు. ఇలా ఫైన్‌ విధించినప్పుడే ఇలాంటి వారు అదుపులో ఉంటారని కామెంట్స్ పెడుతున్నారు.


Next Story