డ్రైవ‌ర్ లేకుండానే స్టార్ట్ అయి.. త‌నంత‌ట తాను క‌దిలిన ట్రాక్ట‌ర్‌.. ఆ త‌రువాత‌

డ్రైవ‌ర్ లేకుండానే ఓ ట్రాక్ట‌ర్ దానంత‌ట అదే స్టార్ట్ అయ్యింది. చెప్పుల దుకాణంలోని దూసుకువెళ్లింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 March 2023 5:33 AM GMT
Uttar Pradesh,Virla video

షాపులోకి దూసుకువెలుతున్న ట్రాక్ట‌ర్‌కొన్ని ఘ‌ట‌న‌లు చెబితే ఎవ్వ‌రూ న‌మ్మ‌రు. సీసీ కెమెరాల్లో రికార్డు కాక‌పోయి ఉంటే నిజంగా ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌లేద‌ని కొట్టిపారేసే వారు ఉంటారు. చెప్పుల షాపు ముందు ఉంచిన ఓ ట్రాక్ట‌ర్ అక‌స్మాత్తుగా దానిక‌దే స్టార్ట్ అయ్యింది. అద్దాల‌ను బ‌ద్ద‌లు కొట్టుకుంటూ షాపులోనికి దూసుకువెళ్లింది. అక్క‌డ ఉన్న వారికి ఏమీ అర్థం కాలేదు. ఈ ఘ‌ట‌న ఉత్తర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రిగింది.

స్థానికులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. హోలీ పండుగ కోసం బిజ్నోర్ కొత్వాలి సిటీ పోలీస్ స్టేషన్ లో పోలీసులు శాంతి క‌మిటీ స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి కిష‌న్ కుమార్ అనే వ్య‌క్తి ట్రాక్ట‌ర్ పై వ‌చ్చాడు. ట్రాక్ట‌ర్‌ను పోలీస్ స్టేష‌న్‌కు స‌మీపంలోని ఓ చెప్పుల దుకాణం ముందు ఉంచి అత‌డు స‌మావేశంలో పాల్గొన్నాడు. దాదాపు గంట‌కు పైగా ట్రాక్ట‌ర్ అక్క‌డే ఉంది. అయితే.. ఉన్న‌ట్లు ఉండి ఆ ట్రాక్ట‌ర్ దానంత‌టే స్టార్ట్ అయ్యింది.

షాపులోకి దూసుకువెళ్లింది. ఆ షాపు ముందు ఉన్న‌ అద్దం మొత్తం ప‌గిపోయింది. షాపులోని ఉద్యోగులు భ‌యంతో కేక‌లు వేస్తూ బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇంత‌లో ఓ వ్య‌క్తి ఆ ట్రాక్ట‌ర్ ఇంజిన్‌ను ఆపేశాడు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఎవ్వ‌రికి ఏమీ కాన‌ప్ప‌టికీ చెప్పుల షాపు య‌జ‌మానికి కొంత న‌ష్టం వాటిల్లింది. త‌న‌కు జ‌రిగిన న‌ష్టాన్ని భ‌ర్తీ చేయాలంటూ ట్రాక్ట‌ర్ య‌జ‌మానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కాగా.. ఈ ఘ‌ట‌న మొత్తం ఆ షోరూమ్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఒక‌రు దెయ్యం అంటుంటే, ఇది నిజ‌మేనా నేను చాలా భ‌య‌ప‌డ్డా అంటూ ఇంకొక‌రు కామెంట్ చేశారు.

Next Story
Share it