క్రికెట్ స్టేడియంలో పాము ప్రత్యక్షం..ఉలిక్కిపడ్డ ఆటగాళ్లు (వీడియో)
లంక ప్రీమియర్ లీగ్‌లో జరుగుతున్న ఓ స్టేడియంలోకి పాము ఎంట్రీ ఇచ్చింది. దాంతో స్టేడియంలో ఉన్న ఆటగాళ్లంతా ఉలిక్కిపడ్డారు.
By Srikanth Gundamalla Published on 1 Aug 2023 11:26 AM ISTక్రికెట్ స్టేడియంలో పాము ప్రత్యక్షం..ఉలిక్కిపడ్డ ఆటగాళ్లు (వీడియో)
స్టేడియాల్లో మ్యాచ్‌లు జరిగేటప్పుడు అభిమానులు ఉత్సాహం కనబరుస్తారు. అభిమాన ప్లేయర్లను కలిసేందుకు స్టేడియంలోకి పరుగెడతారు. అప్పుడప్పుడు పక్షలు అనుకోకుండా వచ్చి క్యాప్చర్ అవుతుంటాయి. పెంపుడు జంతువులు కూడా స్టేడియంలో తిరుగుతూ కనిపించాయి. తాజాగా లంక ప్రీమియర్ లీగ్‌లో జరుగుతున్న ఓ స్టేడియంలోకి పాము ఎంట్రీ ఇచ్చింది. ఈ అనూహ్య పరిణామంతో స్టేడియంలో ఉన్న ఆటగాళ్లంతా ఉలిక్కిపడ్డారు. పాము గ్రౌండ్‌లో తిరిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొలంబో వేదికగా గాలె టైటాన్స్, దంబుల్లా ఆరా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. దంబుల్లా జట్టు బ్యాటింగ్ చేస్తుండగా పాము మైదానంలోకి ప్రవేశించింది. క్రీజులో ధనంజయ్ డిసిల్వా, కుశాల్ పెరీరా ఉన్నారు. ఇంతలోనే పాము మైదానంలోకి వచ్చినట్లు స్క్రీన్‌పై చూపించారు. దాంతో.. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అడవిలో తిరగాల్సిన పాము స్టేడియంలోకి ఎలా వచ్చిందా అనుకున్నారు. వెంటనే అంపైర్లు స్టేడియం భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. పాము మాత్రం కాసేపు స్టేడియంలోనే అటు ఇటూ తిరిగింది. ఇదంతా కెమెరాల్లో రికార్డు అయ్యింది. స్టేడియంలో పాము తిరగడంతో దాదాపు 10 నిమిషాల పాటు మ్యాచ్ ఆగిపోయింది. ప్రస్తు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. సూపర్ ఓవర్‌లో దంబుల్లాపై గాలే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గాలె టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం దంబుల్లా కూడా 7 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 180 పరుగులే చేసింది. సూపర్ మ్యాచ్‌కు దారి తీసింది. సూపర్‌ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దంబుల్లా వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన గాలె టైటాన్స్ కేవలం రెండు బంతుల్లోనే 11 పరుగులు చేసి విజయం సాధించింది. సూపర్ ఓవర్‌లో గాలె ఓపెనర్ రాజపాక్స వరుసగా సిక్స్, ఫోర్ బాది తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.
Hello, stranger. Where is your accreditation card? 🐍Even the Sri Lankan wildlife can't resist the action at the LPL! 🏏#LPL2023 #LiveTheAction pic.twitter.com/R9Fa5k1D3p
— LPL - Lanka Premier League (@LPLT20) July 31, 2023