Video: అధికారిణి లంచం డిమాండ్.. రూ.2 లక్షల కరెన్సీ నోట్లు విసిరేసిన సర్పంచ్
మహారాష్ట్రలోని ఓ గ్రామ సర్పంచి.. కరెన్సీ నోట్ల దండలను మెడలో వేసుకుని.. డబ్బులు వెదజల్లాడు. అయితే అతడు డబ్బులు ఎక్కువయ్యో
By అంజి Published on 3 April 2023 4:30 AM GMTVideo: అధికారిణి లంచం డిమాండ్.. రూ.2 లక్షల కరెన్సీ నోట్లు విసిరేసిన సర్పంచ్
మహారాష్ట్రలోని ఓ గ్రామ సర్పంచి.. కరెన్సీ నోట్ల దండలను మెడలో వేసుకుని.. డబ్బులు వెదజల్లాడు. అయితే అతడు డబ్బులు ఎక్కువయ్యో, ఎదో ఉత్సవం కోసమో ఇలా చేయలేదు. రైతులకు బావులు మంజూరు చేయమని అడిగినందుకు పైఅధికారి లంచం అడగడంతో సర్పంచ్ ఆగ్రహాంతో ఈ విధంగా నిరసన తెలిపాడు. శంబాజీనగర్ జిల్లా పుల్రంబీ పంచాయితీ సమితి పరిధిలోని గోవరాయ్ పయాగ్ గ్రామ సర్పించి మంగేష్ సాబడే వినూత్న నిరసన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గోవరాయ్ పయాగ్ గ్రామానికి 20 బావులు మంజూరయ్యాయి. ఒక్కో బావికి ప్రభుత్వం రూ.4 లక్షలు కేటాయించింది. వాటి పనులు ప్రారంభించాలని పలుమార్లు సర్పంచి మంగేష్ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ జ్యోతి కవడదేవికి విజ్ఞప్తి చేశారు. అయితే ఆమె ఒక్కో బావికి రూ.48 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు పేదవారని, వారి దగ్గర డబ్బులులేవని చెప్పినా ఆ ఆఫీసర్ కనికరించలేదు. దీంతో కోపోద్రిక్తుడైన మంగేష్.. 2 లక్షల రూపాయలతో కూడిన కరెన్సీ దండను మెడలో వేసుకుని శుక్రవారం సమితి కార్యాలయం ముందు డబ్బు వెదజల్లాడు. సర్పంచ్ వీడియో వైరల్‌గా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
సర్పంచి నిరసనను గుర్తించి.. బీడీవోపై చర్యలు తీసుకున్నారు. సర్పంచ్ ఆందోళనను గమనించిన రాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ పంచాయతీ సమితి ఆఫీసర్‌ను వెంటనే సస్పెండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. మంత్రి గిరీష్ మహాజన్ తీసుకున్న చర్యను మంగేష్ స్వాగతించారు. అలాగే తాను వెదజల్లిన రూ.2 లక్షలను ఆ మహిళా అధికారి నుంచి రికవరీ చేసి ఇప్పించాలని సంబంధిత సీనియర్ అధికారులు, కలెక్టర్‌ను కోరతానన్నారు. తాను వెదజల్లిన డబ్బు.. రైతులదని సర్పంచి చెప్పాడు.