మ‌హిళ స్కూటీపై వెలుతుండ‌గా.. రోడ్డుపై పగుళ్లు.. ఎగిసిప‌డ్డ నీళ్లు

పైప్‌లైన్ పగిలిపోవడంతో రోడ్లుపై పగుళ్లు ఏర్పడి స్కూటీపై వెళ్తున్న మహిళ భారీ నీటి ప్రవాహంలో చిక్కుకుపోయింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 March 2023 7:02 AM GMT
Maharashtra, Road cracks

రోడ్డుపై ప‌గుళ్లు ఏర్ప‌డి నీళ్లు ఎగిసి ప‌డుతున్న దృశ్యం

రోడ్డు పై ప్ర‌యాణిస్తుంటే హ‌ఠాత్తుగా రోడ్డు కుంగిపోతే, అదే స‌మ‌యంలో రోడ్డు మ‌ధ్య‌లోంచి నీరు పైకి పౌంటేన్‌లా ఎగజిమ్మితే ఎలా ఉంటుందో ఒక్క‌సారి ఊహించుకోండి. త‌ల‌చుకుంటే ఒళ్లు జ‌ల‌ద‌రించ‌క‌మాన‌దు. స‌రిగ్గా ఇలాంటి అనుభ‌వ‌మే ఓ మ‌హిళ‌కు ఎదురైంది. ఏదో ప‌ని నిమిత్తం ఓ మ‌హిళ త‌న స్కూటీపై వెలుతుండ‌గా అక‌స్మాత్తుగా రోడ్డు కుంగిపోయింది. రెండుగా చీలి నీరు పౌంటేన్‌గా ఎగిసిప‌డింది. అనుకోని ఈ ప‌రిణామం కార‌ణంగా మ‌హిళ తీవ్రంగా గాయ‌ప‌డింది. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్రలో చోటు చేసుకుంది.

మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో శనివారం రోడ్డు కింద ఉన్న నీటి పైపులైన్ పగిలింది. పైప్‌లైన్ పగిలిపోవడంతో రోడ్లుపై పగుళ్లు ఏర్పడి స్కూటర్‌పై వెళ్తున్న మహిళ భారీ నీటి ప్రవాహంలో చిక్కుకుపోయింది. ఈ ఘటన యావత్మాల్ విదర్భ హౌసిన్ సమీపంలో జ‌రిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

భూమి దిగువ నుండి నీరు బలంగా ప్రవహించడంతో రహదారి గుంతలమయం కావడాన్ని వీడియోలో చూడవచ్చు. పింక్ దుస్తులతో స్కూటీపై వస్తున్న ఒక మహిళ వాటర్ కెరటంలో చిక్కుకుపోవడం కూడా క‌నిపిస్తుంది. ఆమె నీటి అలలతో కొట్టుకుని గాయపడింది. స్థానికులు వెంట‌నే ఆమ‌హిళ‌ను ర‌క్షించారు. చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Next Story