Video: నాకే డ్రైవింగ్ రాదంటావా? యువతి చెంప చెల్లుమనిపించిన ర్యాపిడో డ్రైవర్

ఓ మహిళను ర్యాపిడో డ్రైవర్ చెంప దెబ్బ కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

By Knakam Karthik
Published on : 16 Jun 2025 4:35 PM IST

Virao Video, Karnataka, Jayanagar, Rapido Driver, Woman

Video: నాకే డ్రైవింగ్ రాదంటావా? యువతి చెంప చెల్లుమనిపించిన ర్యాపిడో డ్రైవర్

బెంగళూరు సిటీలోని జయనగర్‌లో ఓ మహిళను ర్యాపిడో డ్రైవర్ చెంప దెబ్బ కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాపిడో డ్రైవర్ ఆ మహిళను బలంగా చెంపదెబ్బ కొట్టడం, ఆమె నేలపై పడిపోవడం కనిపిస్తుంది. వారి చుట్టూ ఉన్న అనేక మంది ప్రేక్షకులు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండటం కనిపిస్తుంది...వివరాల్లోకి వెళ్తే.. ఒక నగల దుకాణంలో పనిచేసే యువతి రాపిడో బైక్ ట్యాక్సీని బుక్ చేసుకుంది. అయితే రైడర్ నిర్లక్ష్యంగా, వేగంగా వాహనం నడుపుతుండటంతో ఆమె భయాందోళనకు గురైంది. దీంతో ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేసి బైక్ దిగిపోయింది. ఈ క్రమంలో రైడర్ తీరును ఆమె ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.

సదరు యువతి ఇంగ్లీషులో మాట్లాడుతుండగా రైడర్ కేవలం కన్నడలోనే సమాధానం చెప్పడంతో ఒకరి మాటలు ఒకరికి అర్థం కాలేదు. ప్రయాణ ఛార్జీ చెల్లించేందుకు, హెల్మెట్ తిరిగి ఇచ్చేందుకు మహిళ నిరాకరించిందని సమాచారం. ఈ క్రమంలో సహనం కోల్పోయిన రైడర్ ఆమెపై చేయి చేసుకున్నాడు. ఈ దాడిలో మహిళ కిందపడిపోయింది. వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరూ తీవ్రంగా వాగ్వాదానికి దిగడం, చుట్టూ ఉన్నవారిని కలుగజేసుకోవాలని కోరడం కనిపిస్తోంది. అయితే అక్కడున్నవారు ఎవరూ వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. రైడర్ మహిళను కొట్టిన తర్వాత కూడా ఎవరూ జోక్యం చేసుకోకపోవడం గమనార్హం.

నిందితుడు రాపిడో డ్రైవర్ సుహాస్ తరువాత ఆ మహిళ తనను మొదట కొట్టిందని పేర్కొన్నాడు. "ఆమె మొదటి నుండి అసభ్యంగా మాట్లాడుతోంది. ఆమె సమయం ఆదా చేసుకోవడానికి నేను జయనగర్ గుండా ఒక షార్ట్‌కట్ తీసుకున్నాను, కానీ ఆమె నన్ను ప్రశ్నిస్తూనే ఉంది. నేను ఏమి చదువుకున్నాను, నాకు డ్రైవింగ్ ఎలా చేయాలో తెలుసా అని అడిగింది" అని అతను చెప్పాడు.

ఈ ఘటనపై పోలీసు వర్గాలు స్పందించాయి. బాధితురాలిని సంప్రదించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరినప్పటికీ ఆమె అందుకు సుముఖత చూపలేదని తెలిసింది. దీంతో పోలీసులు నాన్-కాగ్నిజబుల్ రిపోర్ట్ (ఎన్.సి.ఆర్.) నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story