లంచం పంపకాల్లో గొడవ..రోడ్డుపై పోలీసుల డిష్యూం డిష్యూం (వీడియో)

లంచం పంపకాల విషయంలో ఇద్దరు పోలీసుల మధ్య వివాదం చెలరేగింది. దాంతో.. నడిరోడ్డుపై పిడిగుద్దులు గుద్దుకుంటూ గొడవపడ్డారు.

By Srikanth Gundamalla  Published on  19 Sept 2023 11:35 AM IST
Police, Fight, bribe,  Bihar, viral video,

లంచం పంపకాల్లో గొడవ..రోడ్డుపై పోలీసుల డిష్యూం డిష్యూం (వీడియో)

ప్రభుత్వ అధికారులు కొందరు అవినీతి పాల్పడతారు. ఏదైనా పని చేయమని కోరితే చాలు.. నాకేంటి అని ప్రశ్నిస్తారు. వారి చేతిలో కొంత మొత్తంలో డబ్బులు పెడితే కాని పని చేసిపెట్టరు. ఇక కొందరు పోలీసులు అయితే.. రోడ్లపై నిలబడి వాహనాదారులను నిలిపి పత్రాలు లేకపోతే ఫైన్ విధిస్తారు. ఉన్నతాధికారులు చూడకపోతే కొంత డబ్బులు తీసుకుని అలాంటి వారిని వదిలేస్తారు. అలా వచ్చిన లంచాన్ని పంచుకుంటారు. అయితే.. బీహార్‌లో ఇద్దరు పోలీసులు కూడా ఇదే పని చేశారు. కానీ.. తీసుకున్న లంచమే వారి మధ్య గొడవ పెట్టింది. ఏకంగా నడిరోడ్డుపై పిడిగుద్దులు గుద్దుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జనాల దగ్గర నుంచి వసూలు చేసిన లంచం పంపకాల విషయంలో ఇద్దరు పోలీసుల మధ్య వివాదం వచ్చింది. బీహార్‌లోని నలంద జిల్లాలో చోటుచేసుకుంది ఈ సంఘటన. మాటా మాటా పెరిగి హైవేపైనే ఇద్దరు కొట్టుకున్నారు. పోలీస్‌ వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపి పిడిగుద్దులు గుద్దుకున్నారు. జీపులో ఉన్న కర్ర తీసి ఒకరు కొట్టేందుకు ప్రయత్నిస్తే.. మరొకరు చెట్టుకొమ్మ విరిచి దాడి చేసేందుకు యత్నించాడు. ఇద్దరు పోలీసులు రోడ్డుపై కొట్టుకుంటుండగా గుమిగూడిన వాహనదారులు సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. కొందరు వద్దు గొడవపడకండి అని చెప్పినా ఆ పోలీసులు మాత్రం వినకుండా అలాగే ఫైటింగ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే.. వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో చివరకు బీహార్‌ పోలీసు ఉన్నతాధికారులకు చేరింది. పోలీసుల ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతుండటంతో ఉన్నతాధికారులు స్పందించారు. రోడ్డుపైనే గొడవపడ్డ ఇద్దరు పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికీ వారిని పోలీస్‌ సెంటర్‌కు పిలిచామని.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అయితే.. లంచం తీసుకుని పంపకాల్లో గొడవపడ్డ ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయాలని కొందరు కోరుతుంటే.. ఇంకొందరు మాత్రం వారిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని కోరుతున్నారు.

Next Story