Video: బీజేపీ నాయకుడితో గొడవ.. యూనిఫాం తొలగించిన పోలీసు
మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో బీజేపీ కౌన్సిలర్ భర్తతో వాగ్వాదం తర్వాత అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ తన యూనిఫాంను తొలగించిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
By అంజి Published on 17 Sept 2024 8:17 AM IST
Video: బీజేపీ నాయకుడితో గొడవ.. యూనిఫాం తొలగించిన పోలీసు
మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో బీజేపీ కౌన్సిలర్ భర్తతో వాగ్వాదం తర్వాత అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ తన యూనిఫాంను తొలగించిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో.. సింగ్రౌలిలోని వైధాన్‌లో బీజేపీ కౌన్సిలర్ గౌరీ గుప్తా భర్త అర్జున్ గుప్తాతో వివాదం జరుగుతుండగా అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ వినోద్ మిశ్రా తన యూనిఫాంను తొలగించడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో ఎనిమిది నెలల నాటిదని, యూనిఫాం పట్ల అగౌరవంగా వ్యవహరించినందుకు వినోద్ మిశ్రా అనే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకున్నామని సింగ్రౌలీ పోలీస్ సూపరింటెండెంట్ నివేదితా గుప్తా తెలిపారు.
Old Video Of Cop Removing Uniform After Argument With BJP Leader Goes Viral https://t.co/x0jAxeKk77 pic.twitter.com/pVEvaR7HVN
— NDTV (@ndtv) September 16, 2024
డ్రెయిన్ నిర్మాణం విషయంలో అర్జున్, వినోద్‌ల మధ్య వివాదం చెలరేగిందని, దీంతో వినోద్ లేచి యూనిఫాం తీసేసుకున్నాడని తెలిసింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో మిశ్రా వార్షిక ఇంక్రిమెంట్‌ను కూడా నిలిపివేయాలని ఆదేశించినట్లు ఎస్పీ తెలిపారు. ఎనిమిది నెలల తర్వాత ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఎవరు లీక్ చేశారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని ఆమె తెలిపారు. తన ఇంటి ముందు జరుగుతున్న డ్రైన్ నిర్మాణంపై చర్చించేందుకు కౌన్సిలర్ ఇంటికి వెళ్లినట్లు వినోద్ మిశ్రా తెలిపారు.
అయితే.. గౌరి, వినోద్ ఈ విషయం గురించి చర్చిస్తున్నప్పుడు, అర్జున్ తనతో "వినోద్‌కు యూనిఫాం లేకుండా చేస్తాను" అని చాలాసార్లు బెదిరించాడని, దానితో వినోద్ కోపంగా, అతని యూనిఫాం తొలగించాడని ఎస్పీ తెలిపారు. "అతను నా యూనిఫాం తీసేస్తానని పదే పదే చెబుతూనే ఉన్నాడు. అందుకే యూనిఫాం తీసేసి అతనికి ఇచ్చాను" అన్నాడు వినోద్. "నేను భిక్షాటన చేస్తానని చెప్పాను, కానీ నేను ఉద్యోగం చేయలేను, అందుకే అతనికి యూనిఫాం ఇచ్చాను, నాకు న్యాయం చేయలేకపోతే, నేను ఈ పని ఎలా చేయగలను?" అన్నాడు.
"నేను ఇలా స్పందించి ఉండాల్సింది కాదు" అని వినోద్ మిశ్రా చెప్పినట్లు వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది . ఈ ఘటన తర్వాత తన రక్తపోటు పెరిగిపోయిందని, అపస్మారక స్థితికి చేరుకున్నానని చెప్పాడు.