పాముకి సీపీఆర్ చేసిన పోలీసు, వీడియో వైరల్

ఓ పోలీసు అపస్మారక స్థితిలోకి వెళ్లిన పాముకు సీపీఆర్ చేశాడు.

By Srikanth Gundamalla  Published on  26 Oct 2023 3:07 PM IST
madhya pradesh, police conistable, cpr, revive, snake,

పాముకి సీపీఆర్ చేసిన పోలీసు, వీడియో వైరల్

పాము అంటే ఎవరికైనా భయమే. దూరం నుంచి చూస్తేనే చాలా మంది హడలిపోతారు. పాముల్లో చాలా వరకు ప్రాణాలకు హాని చేయకపోయినా భయపడిపోతుంటారు. అయితే.. అవే పాములు అడవి మార్గాన ఉన్న రోడ్డు దాటుతూ చనిపోతూ ఉంటాయి. ఇంకొన్ని సార్లు దారి తప్పి ఇళ్ల మధ్యలకు వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు స్నేక్‌ క్యాచర్స్‌ వాటిని పట్టుకుని మళ్లీ అడవుల్లో వదిలేస్తుంటారు. అయితే.. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పోలీసు అపస్మారక స్థితిలోకి వెళ్లిన పాముకు సీపీఆర్ చేశారు.

మామూలుగా మనుషులకు హార్ట్‌ ఎటాక్ వచ్చినప్పుడు.. ఊపిరి ఆడని అత్యవసర సమయాల్లో సీపీఆర్ చేస్తుండటం చాలా చూశాం. అయితే.. పాముకు సీపీఆర్ అంటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడిచే విషయమే. సెమ్రీ హర్‌చంద్‌లోని తవా కాలనీలోకి ఓ పాము దారి తప్పి వచ్చింది. అయితే.. ఆ పాము నీటి పైప్‌లైన్‌లో చిక్కుకుంది. భయపడి బయటకు రాలేదు. దాన్ని బయటకు తీసుకొచ్చేందుకు స్థానికులు పురుగుల మందు కలిపిన నీటిని పైప్‌లైన్‌లో పోశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ అతుల్ శర్మ వెంటనే అక్కడికి చేరుకున్నాడు. పురుగుల ముందు నీటిని తీసుకున్న పాము అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ తర్వాత దాని శరీరంపై ఉన్న పురుగుల మందు పోవడానికి మంచి నీటిని చల్లారు. ఆ తర్వాత దాన్ని బతికించేందుకు ఆ కానిస్టేబుల్ సాహసమే చేశాడు. ఏకంగా పాము నోటికి తన నోరుని పెట్టి ఊపిరి అందించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. అతడు సీపీఆర్ ఇస్తుండగా పాము కదలడం ప్రారంభించింది. వీడియోను చాలా మంది షేర్ చేశారు. మరోవైపు ఈ వీడియో చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో మరికొందరు ఆ పోలీసు ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.

కానిస్టేబుల్ అతుల్ ఇప్పటి వరకు చాలా పాములను కాపాడినట్లు తెలుస్తోంది. 2008 నుండి ఇప్పటి వరకూ 500 పాములను రక్షించానని అతను పేర్కొన్నాడు. డిస్కవరీ ఛానెల్ చూసి, పాములను ఎలా రక్షించాలో నేర్చుకున్నట్లు కానిస్టేబుల్ అతుల్ తెలిపాడు.

Next Story